Virat Kohli : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. కోహ్లీని ఊరిస్తున్న ప‌లు రికార్డులు ఇవే.. ఎన్ని అందుకుంటాడో..?

ఇంగ్లాండ్ జ‌ట్టు పై కోహ్లీకి మంచి రికార్డు ఉండ‌డంతో ఈ సిరీస్‌లోనే చాలా రికార్డులు అందుకునే అవ‌కాశం ఉంది.

Virat Kohli : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. కోహ్లీని ఊరిస్తున్న ప‌లు రికార్డులు ఇవే.. ఎన్ని అందుకుంటాడో..?

Virat Kohli

Virat Kohli : ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-2025 సైకిల్‌లో ఫైన‌ల్‌కు చేరుకోవాలంటే భార‌త్‌కు ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ గెల‌వ‌డం ఎంతో ముఖం. జ‌న‌వ‌రి 25 నుంచి ఈ టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. మొద‌టి టెస్టు మ్యాచ్‌కు హైద‌రాబాద్ వేదిక కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని ప‌లు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇంగ్లాండ్ జ‌ట్టు పై కోహ్లీకి మంచి రికార్డు ఉండ‌డంతో ఈ సిరీస్‌లోనే చాలా రికార్డులు అందుకునే అవ‌కాశం ఉంది. అవేంటో ఓ సారి చూద్దాం..

టెస్టుల్లో 9 వేల ప‌రుగులు..

విరాట్ కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 113 టెస్టు మ్యాచులు ఆడాడు. 49.1 స‌గ‌టుతో 8848 ప‌రుగులు చేశాడు. ఇందులో 29 సెంచ‌రీలు, 30 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. కాగా.. కోహ్లీ మ‌రో 152 ప‌రుగులు చేస్తే టెస్టుల్లో తొమ్మిది వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాళ్లు స‌చిన్ టెండూల్క‌ర్‌, సునీల్ గ‌వాస్క‌ర్‌, రాహుల్ ద్ర‌విడ్‌లు మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించారు. వీరి స‌ర‌స‌న విరాట్ చేరుతాడు.

9 ఫోర్లు బాదితే..

టెస్టు క్రికెట్‌లో 1000 ఫోర్లు కొట్టిన ఆట‌గాడిగా నిల‌వ‌డానికి కోహ్లీకి ఇంకో 9 ఫోర్లు అవ‌స‌రం. దిగ్గ‌జ ఆట‌గాళ్లు స‌చిన్ టెండూల్క‌ర్‌, రాహుల్ ద్ర‌విడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ల‌క్ష్మ‌ణ్, సునీల్ గ‌వాస్క‌ర్‌లు మాత్ర‌మే వెయ్యి లేదా అంత‌క‌న్నా ఎక్కువ ఫోర్లు కొట్టిన టీమ్ఇండియా బ్యాట‌ర్లు.

ఫోన్లో షోయబ్ మాలిక్ మొదటి పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా?

మ‌రో 9 ప‌రుగులు చేస్తే..

ఈ సిరీస్‌లో కోహ్లీ మ‌రో 9 ప‌రుగులు చేస్తే ఇంగ్లాండ్ జ‌ట్టు పై టెస్టుల్లో 2000 ప‌రుగులు పూర్తి అవుతాయి. టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌లో ఇంగ్లాండ్ పై టెస్టుల్లో 2వేల ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు స‌చిన్ టెండూల్క‌ర్‌, సునీల్ గ‌వాస్క‌ర్‌లు మాత్ర‌మే. కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లాండ్‌తో 28 టెస్టులు ఆడాడు. 43.36 స‌గ‌టుతో 1991 ప‌రుగులు చేశాడు.

ఓ జ‌ట్టు పై అత్య‌ధిక ప‌రుగులు..

ఇంగ్లాండ్ పై మ‌రో 52 ప‌రుగులు చేస్తే టెస్టుల్లో ఒక‌ జ‌ట్టు పై తాను చేసిన అత్య‌ధిక ప‌రుగుల రికార్డును తిర‌గ‌రాయ‌నున్నాడు. ఆస్ట్రేలియా పై 25 టెస్టులు ఆడిన కోహ్లీ 2042 ప‌రుగులు చేశాడు.

మూడు శ‌త‌కాలు బాదితే..

ఈ సిరీస్‌లో కోహ్లీ మూడు సెంచ‌రీలు చేస్తే.. ఇంగ్లాండ్ పై అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు చేసిన బ్యాట‌ర్‌గా నిల‌వ‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లీష్ జ‌ట్టు పై కోహ్లీ 5 శ‌త‌కాలు బాదాడు. స‌చిన్ టెండూల్క‌ర్‌, సునీల్ గ‌వాస్క‌ర్‌లు ఇద్ద‌రూ ఇంగ్లాండ్ పై చెరో 7 శ‌త‌కాలు బాదారు.

SA20 2024 : ఆనందంలో నువ్వేం చేశావో నీకు తెలుసా త‌ల్లీ..!