ట్విట్టర్‌ షేక్: కోహ్లీ చేసిన ధోనీ బర్త్ డే ట్వీట్‌

ట్విట్టర్‌ షేక్: కోహ్లీ చేసిన ధోనీ బర్త్ డే ట్వీట్‌

Updated On : December 11, 2019 / 1:53 AM IST

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ ప్రస్తుత భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు. క్రీజులో ఉన్నా.. స్టేడియంలో కూర్చున్నా వారిద్దరినీ చూస్తుంటే అభిమానులకు ఓ జోష్. అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల వర్షం కురిపించిన వీరిద్దరికీ సోషల్ మీడియాలోనూ అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. 

ఈ క్రమంలోనే ధోనీ పుట్టినరోజుకు విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ఈ సంవత్సరం మొత్తంలో టాప్ గా నిలిచింది. ఈ ఏడాది ఒక ట్వీట్‌ను అత్యధికంగా రీట్వీట్ అయిన ఘనత దక్కించుకుంది. ట్విటర్‌ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. 

‘మహీభాయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. కొద్ది మందికే నమ్మకం, గౌరవానికి నిజమైన అర్థం తెలుసు. ఎన్నో ఏళ్లుగా నీతో నాకు అలాంటి స్నేహం ఉన్నందుకు సంతోషంగా ఉంది. మా అందరికీ మీరే పెద్దన్న. నేనింతకు ముందే చెప్పినట్టు నాకెప్పటికీ నువ్వే నా కెప్టెన్‌’ అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. 

ఆ ట్వీట్ 45వేలకు పైగా రీట్వీట్‌ అయింది. 4.2 లక్షల లైకులు లభించాయి. మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగుస్తున్న సందర్భంగా ట్విటర్‌ ఇండియా ‘ట్వీటు’ రికార్డులను వెల్లడించింది. ‘క్రీడా ప్రపంచంలో విరాట్‌ కోహ్లీ చేసిన ఈ ట్వీట్‌ ప్రజల హృదయాలను గెలుచుకుంది. క్రీడా విభాగంలో అత్యధిక రీట్వీట్లు సాధించింది’ అని పేర్కొంది.