Fatima sana : అందుకే భారత్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా హాట్ కామెంట్స్..
భారత్ చేతిలో ఓడిపోవడానికి గల కారణాలను పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima sana) వెల్లడించింది.

Womens ODI World Cup 2025 Fatima sana Comments after Pakistan lost match to India
Fatima sana : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఆదివారం కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో హర్లీన్ డియోల్ (46; 65 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రిచా ఘోష్ (35 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడిక్స్ (32; 37 బంతుల్లో 5 ఫోర్లు), ప్రతీక రావల్ (31; 37 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు వికెట్లు తీసింది. ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఆ తరువాత 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సిద్రా అమిన్ (81; 106 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా మిగిలిన వాళ్లు విఫలం కావడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మలు చెరో మూడు వికెట్లు తీశారు. స్నేహ్ రాణా రెండు వికెట్లు పడగొట్టింది.
కట్టడి చేయడంలో విఫలం..
మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై పాక్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima sana) స్పందించింది. భారత్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో విఫలం కావడమే తమ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకొచ్చింది. పవర్ ప్లేలో చాలా ఎక్కువ పరుగులు ఇచ్చామని తెలిపింది. అదే విధంగా ఇన్నింగ్స్ చివరిలో అనగా డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నామని చెప్పింది. ఈ పరుగుల వల్లే భారత్ మెరుగైన స్కోరు సాధించిందని తెలిపింది.
తన సహచర బౌలర్ డయానా బేగ్ బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు సీమ్ అవుతున్నట్లుగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే.. డయానా మాత్రం సీమ్, స్వింగ్‌ల మధ్య కాస్త గందరగోళానికి గురైనట్లు కనిపించింది. అప్పటికి ఆమెకు తాను పదే పదే సూచనలు చేసినట్లుగా వెల్లడించింది. తదుపరి మ్యాచ్‌లో ఆమె తప్పకుండా మెరుగుఅవుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపింది. ఈ మ్యాచ్‌లో డయానా బేగ్ నాలుగు వికెట్లు తీసినప్పటికి కూడా 69 పరుగులు సమర్పించుకుంది.
Ravindra Jadeja : కోహ్లీ, అశ్విన్‌లను అధిగమించిన రవీంద్ర జడేజా.. ఇక మిగిలింది సచిన్ మాత్రమే..
భారత్ ను 200 కంటే తక్కువ పరుగులకు కట్టడి చేస్తే అప్పుడు బాగుండేది. దాన్ని ఈజీగా ఛేదించేవాళ్లం అని సనా తెలిపింది. ఇక లక్ష్య ఛేదనలో తమ టాప్-5 బ్యాటర్లు తడబడ్డారని చెప్పింది. వాళ్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. మంచి భాగస్వామ్యాలను నెలకొల్పి ఉండాల్సిందని చెప్పింది. ఇక సిద్రా పోరాటం గురించి మాట్లాడుతూ.. ఆమె తమ జట్టులో కీలక ప్లేయర్ అని, నెట్స్‌లో ఎంతో కష్టపడుతుందని, రాబోయే మ్యాచ్‌ల్లో సైతం ఆమె ఇదే రకమైన ఆటతీరును ప్రదర్శించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.