Pratika Rawal : వీల్‌ఛైర్‌లో వ‌చ్చి మ‌రీ జ‌ట్టుతో డ్యాన్స్.. మాట‌లు రావ‌డం లేదు.. ఈ గాయం.. ప్ర‌తీకారావ‌ల్ ఎమోష‌న‌ల్‌..

భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ గెల‌వ‌గానే వీల్‌ఛైర్‌లో మైదానంలోకి వ‌చ్చి మ‌రీ ప్ర‌తీకా రావ‌ల్ (Pratika Rawal) ప్లేయ‌ర్ల‌తో సెల‌బ్రేట్ చేసుకుంది.

Pratika Rawal : వీల్‌ఛైర్‌లో వ‌చ్చి మ‌రీ జ‌ట్టుతో డ్యాన్స్..  మాట‌లు రావ‌డం లేదు.. ఈ గాయం.. ప్ర‌తీకారావ‌ల్ ఎమోష‌న‌ల్‌..

Womens World Cup 2025 Pratika Rawal gets up from wheelchair to dance with Indian team after World Cup win

Updated On : November 3, 2025 / 11:14 AM IST

Pratika Rawal : భార‌త మహిళ‌ల జ‌ట్టు తొలిసారి విశ్వ‌విజేత‌గా నిలిచింది. ఎన్నాళ్లుగానో అంద‌ని ద్రాక్ష‌గా ఊరిస్తూ వ‌స్తున్న మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్ ముద్దాడింది. ఆదివారం న‌వీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జ‌రిగిన మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ 52 ప‌రుగులు తేడాతో గెలిచింది. త‌ద్వారా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను టీమ్ఇండియా ముద్దాడింది. దీంతో ప్లేయ‌ర్ల సంబ‌రాలు అంబరాన్ని అంటాయి.

ఈ క్ర‌మంలో మైదానంలో ఓ దృశ్యం అంద‌రిని ఆక‌ట్టుకుంది. గాయంతో జ‌ట్టుకు దూర‌మైన యువ ఓపెన‌ర్ ప్ర‌తీకా రావ‌ల్ వీల్‌ఛైర్ పై మైదానంలో వ‌చ్చింది. వీల్ చైర్‌లోంచి లేచి మ‌రి జ‌ట్టు స‌భ్యుల‌తో డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ సంబ‌రాల త‌రువాత ప్ర‌తీకా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది.

కీల‌క సెమీస్, ఫైన‌ల్‌కు దూరం..

2024 చివ‌రిలోఅంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసింది ప్ర‌తీకారావ‌ల్‌. ఈ ఢిల్లీ అమ్మాయి నిల‌క‌డగా రాణిస్తూ ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులోనూ చోటు ద‌క్కించుకుంది. ఇక ఈ మెగాటోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన ప్ర‌తీకా ఓ సెంచ‌రీ స‌హా 308 ప‌రుగులు సాధించింది. మ‌రో ఓపెన‌ర్ స్మృతి మంధాన‌తో క‌లిసి అద్భుత ఆరంభాల‌ను జ‌ట్టుకు అందించింది.

Laura Wolvaardt : అందుకే ఓడిపోయాం.. లేదంటే ప్ర‌పంచ‌క‌ప్ మా చేతుల్లో ఉండేది.. ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ కామెంట్స్‌..


అయితే.. లీగ్ ద‌శ‌లో చివ‌రి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భార‌త్ ఆడింది. ఈ మ్యాచ్‌లో బంతికి ఆపే క్ర‌మంలో ప్రతీకా రావ‌ల్ గాయ‌ప‌డింది. వ‌ర్షం కార‌ణంగా చిత్త‌డిగా మారిన మైదానంలో బంతిని ఆపే క్ర‌మంలో ప్ర‌తీకా కుడికాలు మ‌డిమ మ‌డ‌త ప‌డింది. తీవ్ర‌మైన నొప్పితో ఆమె మైదానాన్ని వీడింది. గాయం తీవ్ర‌మైన‌ది కావ‌డంతో ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లు( సెమీస్‌, ఫైన‌ల్ ) ల‌కు దూర‌మైంది.

ఆమె స్థానంలో షెఫాలీ వ‌ర్మ జ‌ట్టులోకి వ‌చ్చింది. సెమీస్‌లో విఫ‌ల‌మైన షెఫాలీ ఫైన‌ల్ మ్యాచ్ లో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో దుమ్మురేపింది. బ్యాటింగ్‌లో 87 ప‌రుగులు చేయ‌డంతో పాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.

ఫైన‌ల్ మ్యాచ్‌లో జ‌ట్టు విజ‌యం సాధించిన త‌రువాత మైదానంలో వ‌చ్చి ప్లేయ‌ర్ల తో పాటు సెల‌బ్రేష‌న్స్ చేసుకున్న ప్ర‌తీకా రావ‌ల్ ఆ త‌రువాత మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. టీమ్ఇండియా ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం సాధించ‌డంతో త‌న‌కు ఎంతో సంతోషంగా ఉందంది. ఈ విజ‌యాన్ని వ‌ర్ణించ‌డానికి త‌న‌కు మాట‌లు రావ‌డం లేదంది. ఇక త‌న భుజం పై ఉన్న జెండా క‌లిగి ఉండ‌డం ఎంతో గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చింది.

Harmanpreet Kaur : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం పై హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌ కామెంట్స్‌.. నేను షెఫాలీ వైపు చూశాను.. కానీ ఆమె మాత్రం..

ఇక త‌న గాయం గురించి మాట్లాడుతూ.. ఆట‌లో గాయాలు కావ‌డం స‌హ‌జం అని చెప్పింది. ప్ర‌పంచ క‌ప్ గెలిచిన జ‌ట్టులో భాగ‌మైనందుకు ఎంతో ఆనందంగా ఉందంది. నేను ఈ జట్టును ప్రేమిస్తున్నాను. ఈ జట్టు పట్ల నా భావాలను నేను వ్యక్తపరచలేను. మేము నిజంగా దీన్ని సాధించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా కాలం తర్వాత ప్రపంచ కప్ గెలిచిన మొదటి జట్టు మనమే.. అని ప్ర‌తీకా అంది.

ఇక ఈ మ్యాచ్‌ను చూస్తున్న‌ప్పుడు.. భార‌త ప్లేయ‌ర్లు సిక్స‌ర్లు కొట్టిన‌ప్పుడు, వికెట్ తీసిన‌ప్పుడు మైదానంలోని ప్రేక్ష‌కుల స్పంద‌న చూసి త‌న‌కు గూస్ బంప్స్ వ‌చ్చాయ‌ని అంది.