ODI World Cup 2023: సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించడానికి అవకాశమున్న జట్లు ఏవో తెలుసా..? పూర్తి వివరాలు ఇలా..
మెగాటోర్నీలో ఈరోజు జరిగే న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ కీలక కానుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.

ODI World Cup 2023
ODI World Cup 2023 Semi Final : భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2023లో మ్యాచ్ లు రసవత్తరంగా మారుతున్నాయి. సెమీఫైనల్ కు వెళ్లే జట్లు ఏవో మరికొద్దిరోజుల్లో తేలనుంది. ఇప్పటి వరకు దాదాపుగా ఇండియా (12 పాయింట్లు), దక్షిణాఫ్రికా (10 పాయింట్లు) జట్లు సెమీ ఫైనల్ కు వెళ్లినట్లే. ఆస్ట్రేలియా (8 పాయింట్లు), న్యూజిలాండ్ (8 పాయింట్లు), పాకిస్థాన్ (6 పాయింట్లు), అఫ్గానిస్థాన్ (6 పాయింట్లు) జట్లు సెమీస్ పై ఆశలు పెట్టుకున్నాయి. మెగాటోర్నీలో ఈరోజు జరిగే న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ కీలక కానుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ న్యూజిలాండ్ ఓడిపోతే పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లకు సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.
సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించడానికి ఏ జట్టుకు అవకాశం ఉందో చూద్దాం..
ఇండియా : భారత్ జట్టు మొత్తం ఆరు మ్యాచ్ లు ఆడింది.. అన్ని మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో (12 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. మరోమూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. దాదాపు భారత్ జట్టు సెమీ ఫైనల్ లోకి చేరుకున్నట్లేనని చెప్పొచ్చు.
దక్షిణాఫ్రికా : సఫారీ జట్టు ఆరు మ్యాచ్ లు ఆడి ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. కనీసం ఒక్క మ్యాచ్ విజయం సాధించినా సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం అవుతుంది.
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా జట్టు ఆరు మ్యాచ్ లలో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో (8 పాయింట్లు) ఉంది. ఇంకా మూడు మ్యాచ్ లు (ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ ) ఆడాల్సి ఉంది. వీటిల్లో రెండు మ్యాచ్ లలో విజయం సాధించినా సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం అవుతుంది. మూడు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే.. నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి.
న్యూజిలాండ్ : న్యూజిలాండ్ జట్టు ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగు గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో తృతీయ స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్ లు ( దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక) ఆడాల్సి ఉంది. వీటిల్లో న్యూజిలాండ్ పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించి.. దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లలో ఏదోఒకదానిపై విజయం సాధించినా సెమీఫైనల్ కు చేరడం ఖాయం.
అఫ్గానిస్థాన్ : ప్రపంచ కప్ లో అఫ్గానిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తుంది. ఈ జట్టుకు సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అప్గాన్ జట్టు ఆరు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్ లు (నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ లలో విజయం సాధిస్తే సెమీ ఫైనల్ కు చేరే అవకాశం ఉంది. మూడు మ్యాచ్ లలో రెండు టీంలపై విజయం సాధిస్తే నాలుగో స్థానంలో నెట్ రన్ రేట్ ప్రకారం సెమీ ఫైనల్ కు అవకాశం ఉండొచ్చు.
పాకిస్థాన్ : బంగ్లాదేశ్ పై విజయంతో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ ఆశలు చిగురించాయి. ఈ జట్లు టోర్నీలో మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడగా.. మూడు మ్యాచ్ లు గెలిచి ఆరు పాయింట్లతో ఉంది. మరో రెండు మ్యాచ్ లు (న్యూజిలాండ్, ఇంగ్లాండ్) ఆడాల్సి ఉంది. సెమీఫైనల్ కు వెళ్లాలంటే పాక్ జట్టు రెండు మ్యాచ్ లలో విజయం సాధించాలి.. అప్పటికీ మిగిలిన జట్ల గెలుపోటములు, ఆ జట్ల రన్ రేట్ పై పాక్ సెమీ ఫైనల్ కు చేరే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
శ్రీలంక : శ్రీలంక జట్టు ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. ఈ జట్టు సమీ ఫైనల్ కు చేరాలంటే మిగిలిన (న్యూజిలాండ్, బంగ్లాదేశ్, భారత్) మ్యాచ్ లలో విజయం సాధించాలి. అప్పటికీ సెమీస్ అవకాశాలు కష్టంగా మారొచ్చు. ఈ జట్టు దాదాపు సెమీఫైనల్ కు చేరే అవకాశాలను కోల్పోయినట్లేనని చెప్పొచ్చు.
నెదర్లాండ్స్ : నెదర్లాండ్స్ జట్టు సెమీఫైనల్ చేరుకోవటం దాదాపు కష్టమే. ఆరు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు గెలిచింది. మరో మూడు మ్యాచ్ లలో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ లలో విజయం సాధిచినా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నెదర్లాండ్స్ జట్టు సెమీస్ కు చేరడం దాదాపు అసాధ్యమే.
ఇంగ్లాండ్ : ఇంగ్లాండ్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ జట్టు ఆరు మ్యాచ్ లు ఆడి.. కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఒకవేళ మూడు మ్యాచ్ లలో విజయం సాధించినా సెమీఫైనల్ కు వెళ్లడం కష్టమే. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు సెమీస్ కు వెళ్లే అవకాశాలు లేవనే చెప్పొచ్చు.
బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ జట్టు సెమీస్ అవకాశాలను కోల్పోయింది. ఆ జట్టు ఏడు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్ లలో విజయం సాధించినా సెమీస్ కు వెళ్లే అవకాశాలు లేవు.