WTC Final మ్యాచ్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైన సఫారీ జట్టు.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప..! ‘చోకర్స్’ ట్యాగ్ తొలగిపోతుందా..

దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్‌క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో సఫారీ జట్టును విజయానికి దగ్గర చేశాడు.

WTC Final మ్యాచ్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైన సఫారీ జట్టు.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప..! ‘చోకర్స్’ ట్యాగ్ తొలగిపోతుందా..

South Africa

Updated On : June 14, 2025 / 7:56 AM IST

WTC Final 2025: ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు బిగ్ షాకిచ్చేందుకు దక్షిణాఫ్రికా జట్టు సిద్ధమైంది. లార్డ్స్ లో జరుగుతున్న ఈ టైటిల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాకు 282 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడోరోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 213 పరుగులు చేసింది. అంటే.. దక్షిణాఫ్రికా టైటిల్ గెలవడానికి కేవలం మరో 69 పరుగులు దూరంలో ఉంది.

Also Raed: Gautam Gambhir : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు బిగ్‌ షాక్‌..! స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన కోచ్ గౌత‌మ్ గంభీర్‌..

దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్‌క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో సఫారీ జట్టును విజయానికి దగ్గర చేశాడు. 159 బంతులు ఎదుర్కొన్న మార్క్‌క్రమ్ 102 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నాడు. ఇందులో 11 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు కెప్టెన్ టెంబా బావుమా సైతం క్రీజులో పాతుకుపోయాడు. 121 బంతుల్లో 65 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నాడు. ఇద్దరు బ్యాటర్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో సఫారీ జట్టు విజయానికి చేరువైంది. శనివారం జరిగే నాల్గోరోజు మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియా ఓటమి దాదాపు ఖాయమైనట్లే. తద్వారా చారిత్రాత్మక విజయాన్ని సఫారీ జట్టు అందుకోనుంది.


‘చోకర్స్’ అనే ట్యాగ్ తొలగిపోతుందా?
దక్షిణాఫ్రికా జట్టును చాలాకాలంగా ‘చోకర్స్’ అని పిలుస్తారు. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో కీలకమైన సమయాల్లో ఓడిపోయినందున ఆ జట్టును చోకర్స్ అని పిలుస్తుంటారు. గత సంవత్సరం 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ లోనూ టీమిండియా చేతిలో సఫారీ జట్టు ఓడిపోయింది. దీంతో ఆ జట్టుకు చోకర్స్ అనే ట్యాగ్ మరింత బలపడింది. కానీ, ఇప్పుడు ఆ ట్యాగ్ నుంచి బయటపడే అవకాశం దక్షిణాఫ్రికా జట్టుకు వచ్చినట్లు కనిపిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో విజయానికి కొద్దిదూరంలో ఆ జట్టు నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు ఏదైనా అద్భుతం చేస్తేతప్ప దాదాపు దక్షిణాఫ్రికా జట్టు విజయం ఖాయమైనట్లే. ఇవాళ జరిగే నాల్గో రోజు ఆటలో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించగలదా.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గా నిలుస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

 

జట్ల స్కోర్ వివరాలు ఇలా..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 212 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 138 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 207 ఆలౌట్
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : 213/2 (ఇంకా ఆడుతుంది).