రూ.2,500లకే జియో 5G స్మార్ట్ ఫోన్లు..

ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధం అవుతోంది. తక్కువ ధరకే డేటాను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో.. ఇప్పుడు రూ.5,000 లోపు కన్నా తక్కువ ధరకే 5G స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అవసరమైతే ఈ 5G స్మార్ట్ ఫోన్లను నెమ్మదిగా రూ.2,500 నుంచి రూ.3,000 ధరకే విక్రయించాలని భావిస్తోందని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.
ప్రస్తుతం 2G కనెక్షన్ వాడుతున్న 20 నుంచి 30 కోట్ల మంది మొబైల్ యూజర్లకు చేరడమే లక్ష్యంగా రిలయన్స్ జియో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే 5G స్మార్ట్ ఫోన్లను రూ.5,000 ధర లోపే తీసుకురావాలని భావిస్తోంది.
మొబైల్ సేల్ బట్టి రూ.2,500 నుంచి రూ.3వేల లోపే డివైజ్ విక్రయించాలని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. 5G స్మార్ట్ ఫోన్ల రాకపై రిలయన్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం 5G స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ.27,000 లనుంచి అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలో 4G మొబైల్ ఫోన్లను లాంచ్ చేసిన మొదటి కంపెనీగా రిలయన్స్ జియో నిలిచింది. జియోఫోన్ కేవలం రూ.1,500 లకే రిఫండబుల్ డిపాజిట్ కింద ఉచితంగా అందించింది. ఈ ఏడాది జరిగిన 43వ కంపెనీ AGM సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇదే అంశంపై ప్రస్తావించారు. ‘2G-mukt’ భారత్ చేయాలని ముఖేశ్ ఆకాంక్షించారు. ప్రస్తుత 5G యుగంలోనూ దేశంలో ఇంకా సుమారు 35 కోట్ల మంది (350 మిలియన్లు) మంది 2G ఫీచర్ ఫోన్ యూజర్లు ఉన్నారని తెలిపారు.
జియో ప్లాట్ ఫాంలపై 7.7 శాతం వాటాతో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ రూ.33,737 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు అంబానీ ప్రకటించారు. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించేందుకు అమెరికా టెక్ దిగ్గజం గూగుల్‌తో జియో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. 5G ప్రయోగాలకు స్పెక్ట్రం కేటాయించాలని ప్రభుత్వాన్ని జియో కోరుతోంది.