ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పది మంది ఓటు ఎటు.. జంపింగ్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో అసంతృప్తితో ఉన్నారా?
బీఆర్ఎస్ నుంచి వచ్చిన పది మందిలో మొత్తానికి మొత్తం కాకున్నా..అందులో కొందరు కారు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధికి ఓటు వేసినా రాజకీయంగా తమకు ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోందట.

తెలంగాణ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఐదు సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా.. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా అధికార కాంగ్రెస్ పార్టీకి నాలుగు, ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కనుంది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇరుకునపెట్టేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను అస్త్రంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోందట.
ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ఆ లెక్కన ఒక ఎమ్మెల్సీ అభ్యర్ధిని మాత్రమే నిలబెట్టాల్సి ఉండగా, రెండో అభ్యర్ధిని కూడా పోటీ పెట్టాలని కారు పార్టీ భావిస్తోందట.
కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను మరింత కార్నర్ చేయాలని డిసైడ్ అయ్యిందట బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఒక ఎమ్మెల్సీని మాత్రమే పోటీ చేయించాల్సి ఉండగా.. రెండో అభ్యర్థితో కూడా నామినేషన్ వేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారట.
పలు సందర్భాల్లో కొంత మంది ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బయటపెట్టారు కూడా. తన ఆఫీస్‌లో కేసీఆర్ ఫోటో తీయబోనని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాహాటంగానే చెప్పారు. తాను పార్టీ మారలేదంటూ గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా దానం నాగేందర్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. వీళ్లే కాదు బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో అంత కంఫర్ట్‌గా లేరన్న ప్రచారం జరుగుతోంది.
టెక్నికల్‌గా ఆ పది మందికి కూడా విప్
ఈ క్రమంలోనే తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన ఆ పది మంది ఎమ్మెల్యేలు కారు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధికి ఓటు వేసే అవకాశాలు లేకపోలేదని బీఆర్ఎస్ భావిస్తోందట. ఎలాగూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ జారీ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్‌గా ఆ పది మందికి కూడా విప్ జారీ చేస్తుంది గులాబీ పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్యంగా ఓటు వేయాల్సి ఉన్నా..ఎవరికి ఓటు వేశారో పార్టీ ఏజెంట్‌కు చూపించి వేయాలన్న నిబంధన ఉంది.
దీంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఆ పది మందిలో ఎవరెవరు అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు, ఎంత మంది తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారో తేలిపోతుందని బీఆర్ఎస్ భావిస్తోందట. రెండో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవలేకపోయినా..పార్టీ మారిన ఎమ్మెల్యేలను మరింత ఇరుకున పెట్టొచ్చని బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోందన్న చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో అభ్యర్ధిని రంగంలోకి దింపి ఓటింగ్ జరిగితే..ఆ పది మంది ఎమ్మెల్యేలంతా మనకే ఓటు వేస్తారా లేదా అనుమానం కాంగ్రెస్ పెద్దలను వెంటాడుతోందట. ప్రచారం జరుగుతున్నట్లు నిజంగానే ఆ పది మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా అని ఆరా తీస్తున్నారట పార్టీ ముఖ్యులు.
బీఆర్ఎస్ నుంచి వచ్చిన పది మందిలో మొత్తానికి మొత్తం కాకున్నా..అందులో కొందరు కారు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధికి ఓటు వేసినా రాజకీయంగా తమకు ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోందట. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోందట కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి సిచ్యువేషన్‌లో ఇప్పటికే వచ్చిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అభ్యర్ధికి ఓటేస్తే..తమకు నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారట పలువురు కాంగ్రెస్ పెద్దలు. బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని దింపితే ఆ పది ఎమ్మెల్యేలు ఓటు ఎటువైపో చూడాలి మరి.