కుషాయిగూడలో దారుణం.. మైనర్ బాలుడిని చితక్కొట్టిన బాలిక కుటుంబ సభ్యులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

హైదరాబాద్ నగరం కుషాయిగూడ పరిధిలో దారుణం జరిగింది.

కుషాయిగూడలో దారుణం.. మైనర్ బాలుడిని చితక్కొట్టిన బాలిక కుటుంబ సభ్యులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Updated On : June 6, 2025 / 11:56 AM IST

Hyderabad: హైదరాబాద్ నగరం కుషాయిగూడ పరిధిలో దారుణం జరిగింది. కూతుర్ని వేధిస్తున్నాడని ఓ బాలిక కుటుంబ సభ్యులు మైనర్ బాలుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్రగాయాలతో పడిఉన్న బాలుడ్ని స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు.

కుషాయిగూడ పరిధిలోని రాధిక సెంటర్ దగ్గరలో ఈ దారుణం జరిగింది. 16 సంవత్సరాల అయాన్ అనే యువకుడు జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే టెన్త్ పూర్తి చేసిన అయాన్.. వేసవి సెలవులు కావడంతో ఖాళీ సమయాల్లో క్యాటరింగ్ బాయ్ గా పనిచేస్తున్నాడు.

గురువారం ఉదయం సైనిక్‌పురిలోని శుభకార్యానికి పనికి వెళ్లాడు. గుర్తు తెలియని ఓ యువకుడు అయాన్ కు ఫోన్ చేసి తమ అమ్మాయిని నిత్యం ఎందుకు వేధిస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. ఫోన్ లో బూతులు తిట్టాడు. ఆ తరువాత రాధికా థియేటర్ సమీపానికి రావాలని, అక్కడ మాట్లాడుకుందామని పిలిచాడు.

అయాన్ రాగానే ఒకేసారి బాలిక కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. మూకుమ్మడిగా దాడిచేసి చితకొట్టారు. దీంతో అతను తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు అయాన్ ను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు.

స్థానికుల సమాచారం మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిపై దాడిచేసిన వారిలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.