కేసీఆర్‌ను ఫాంహౌస్‌ నుంచి బయటకు తీసుకువచ్చే ధైర్యం బీఆర్ఎస్ నేతలకు ఉందా?: ఆది శ్రీనివాస్

ప్రతిపక్ష నేత కేసీఆర్ అడ్రస్ ఇప్పటి వరకు తెలియలేదు. కేసీఆర్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఫాంహౌస్‌లో ఉన్నారా లేక నందినగర్‌లో ఉన్నారా?

కేసీఆర్‌ను ఫాంహౌస్‌ నుంచి బయటకు తీసుకువచ్చే ధైర్యం బీఆర్ఎస్ నేతలకు ఉందా?: ఆది శ్రీనివాస్

Aadi Srinivas: వరద పైన బీఆర్ఎస్ పార్టీ బురద రాజకీయాలు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే ఆ నాయకుల పనిగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సీఎల్పీ మీడియా హాల్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద కష్టాల్లో కూడా కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయాలే కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. అనుకోని విపత్తు  వచ్చినప్పుడు ప్రభుత్వానికి సహకరించకుండా విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. సహాయక చర్యలపై ప్రభుత్వానికి సలహా సూచనలు ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఎక్కడున్నారు?
”కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ ట్విటర్‌లో విషం చిమ్ముతున్నాడు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అడ్రస్ ఇప్పటి వరకు తెలియలేదు. కేసీఆర్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఫాంహౌస్‌లో ఉన్నారా లేక నందినగర్‌లో ఉన్నారా? వరద బాధితుల కుటుంబాలకు కనీసం సంతాపం కూడా తెలపనంత బిజీగా కేసీఆర్ ఉన్నారా? బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి కూడా నోరు రావడం లేదు. కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుని హరీశ్‌రావును జనం పైన దాడికి పంపించారు. ఖమ్మంలో బాధితులను పరామర్శించకుండా హరీశ్‌రావు, ఎమ్మెల్యే లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. హరీశ్‌రావు వైఖరి కారణంగా అక్కడ గందరగోళం చోటు చేసుకుంది. హరీశ్‌రావు నోరు తెరిస్తే రాజకీయం తప్ప మరొకటి లేదు.

కేటీఆర్ 18 గంటల్లో అమెరికా నుంచి రావొచ్చు
గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు విదేశీ కుట్ర అని కేసీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. క్లౌడ్‌ బరస్ట్ ద్వారా భారీ వర్షాలు కురిపిస్తున్నారంటు నోటికొచ్చినట్లు అబద్దాలు చెప్పారు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి వైఫల్యం అంటు కొడుకు, అల్లుడితో విషప్రచారం చేయిస్తున్నాడు. గత పదేళ్లలో అనేక సార్లు వరదలు వచ్చినప్పుడు పరిహారం ఇవ్వకుండా పచ్చి మోసం చేశారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు ఇంటికి పదివేలు పరిహారం ఇస్తామని బాధితులను కేసీఆర్ దగా చేశారు. కేసీఆర్‌ను ఫాంహౌస్‌ నుంచి బయటకు తీసుకువచ్చే ధైర్యం బీఆర్ఎస్ నేతలకు ఉందా? ప్రజలపై అంత ప్రేమ ఉంటే కేటీఆర్ 18 గంటల్లో అమెరికా నుంచి రావొచ్చు.

Also Read : క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.. వరద బాధితులకు విరాళాలు పంపండి!

చిత్తశుద్దితో వరద సహాయక చర్యలు
మా ప్రభుత్వం సహాయక చర్యలపై చిత్తశుద్దితో వ్యవహరిస్తోంది. మా ముఖ్యమంత్రి స్వయంగా రెండు రోజుల పాటు పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం అందజేస్తున్నాం. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి 10 వేల తక్షణ సాయం అందిస్తున్నాం. చనిపోయిన గేదెలు, గొర్రెలు, మేకలు కూడా సాయం ఇస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఈర్షతోనే ఏపీ సీఎం చంద్రబాబు బాగా పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

Also Read : కాంగ్రెస్‌లో కలకలం రేపిన ఎమ్మెల్యే వేముల వీరేశం.. చిన్న విషయానికే అంత సీరియస్‌ ఎందుకయ్యారు?

వీరేశం విషయంలో పొరపాటు జరిగింది
కేంద్రం నుంచి తక్షణ సాయం 2000 కోట్లు ఇవ్వాలని అడిగాం.. స్పందన లేదు. తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిధులు విడుదల చేయాలి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విషయంలో పొరపాటు జరిగింది. ఎమ్మెల్యే వేముల పట్ల అమర్యాదగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాల”ని ఆది శ్రీనివాస్ అన్నారు.