Telangana Assembly Election 2023 : ఆస్తులు, కేసుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే అధికం…ఏడీఆర్ సంచలన నివేదిక వెల్లడి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆస్తులు, వివిధ నేరాల కేసుల్లోనూ ముందున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా వెల్లడించింది. గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువమందిపై క్రిమినల్ కేసులున్నాయి....

Telangana Assembly Election 2023 : ఆస్తులు, కేసుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే అధికం…ఏడీఆర్ సంచలన నివేదిక వెల్లడి

ADR sensational report

Telangana Assembly Election 2023 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆస్తులు, వివిధ నేరాల కేసుల్లోనూ ముందున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా వెల్లడించింది. గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువమందిపై క్రిమినల్ కేసులున్నాయి. గతంలో కంటే ఈసారి ఎక్కువమంది కోటీశ్వరులు ఎన్నికల బరిలో నిలిచారని ఏడీఆర్ విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.

ఎన్నికల బరిలో కోటీశ్వరులు

ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో 90 శాతం మంది ఆస్తిపరులున్నారు. 2,290 మంది తెలంగాణ ఎన్నికల బరిలో నిలవగా వారిలో 580 మంది అభ్యర్థులకు కోటిరూపాయలకు పైగా ఆస్తులున్నాయని తేలింది. తెలంగాణలో 96 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి రూ.3.29 కోట్లు కాగా ఈసారి రూ.4.71 కోట్లకు పెరిగింది. ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువమంది కోటీశ్వరులని ఏడీఆర్ తన నివేదికలో తేల్చి చెప్పింది.

25 మంది స్వతంత్రులకు ఆస్తులే లేవట…

కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తి రూ.38 కోట్లని వెల్లడైంది. 25 మంది స్వతంత్ర అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులు లేవని పేర్కొన్నారు. తమ వద్ద కేవలం 500రూపాయలే ఉన్నాయని ముగ్గురు అభ్యర్థులు పేర్కొన్నారు. అత్యధిక ఆస్తుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువమంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చెన్నూర్ అభ్యర్థి గడ్డం వివేక్ అత్యధికంగా తన ఆస్తి రూ. 606 కోట్లు అని చూపించారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.458కోట్లు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.433కోట్లు, భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి రూ.211 కోట్ల ఆస్తులున్నాయని అఫిడవిట్లలో పేర్కొన్నారు.

ALSO READ : Alert : చైనాలో హెచ్9ఎన్2 మహమ్మారి వ్యాప్తి…కేరళలో ఆరోగ్యశాఖ అధికారుల అలర్ట్

బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ కు రూ.197కోట్లు, కూకట్ పల్లి అభ్యర్థి బండి రమేష్ కు రూ.160 కోట్లు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు రూ.124కోట్ల ఆస్తులున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు పైళ్ల శేఖర్ రెడ్డికి రూ.227 కోట్లు, కొత్త ప్రభాకర్ రెడ్డికి రూ. 197 కోట్లు,శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి ఎం రవికుమార్ యాదవ్ కు రూ.171 కోట్ల ఆస్తులున్నాయి. ఈ సారి డాక్టరేట్ చేసిన 32 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పీజీ చదివిన వారు 477 మంది, ప్రొఫెషనల్ డిగ్రీ విద్యార్హతలున్న వారు 242 మంది, డిగ్రీ ఉన్నవారు 392 మంది ఎన్నికల్లో నిలిచారు.

ఎన్నికల బరిలో నిరక్షరాస్యులు

మరో వైపు 89 మంది నిరక్షరాస్యులు కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం విశేషం. కేసుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందున్నారు. 72 శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 71శాతం మంది బీజేపీ అభ్యర్థులపై వివిధ కేసులున్నాయి. ఎంఐఎంకు చెందిన అభ్యర్థుల్లో 56 శాతం మందిపై కేసులున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 48 శాతం మందిపైనే కేసులున్నాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న 23 శాతం మంది అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది.

ALSO READ : Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతో తెలుసా?

ఏడుగురు అభ్యర్థులపై హత్య కేసులు, మరో ముగ్గురిపై అత్యాచారం కేసులు నమోదైనాయి. మొత్తంమీద ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కోటీశ్వరులతోపాటు నేరచరిత ఉన్న అభ్యర్థులు ఎక్కువమంది పోటీ చేస్తున్నారు. నేరచరితుల్లో ఎంతమంది విజయం సాధిస్తారు అనేది డిసెంబరు 3వతేదీ ఓట్ల లెక్కింపు పర్వంలో వెల్లడి కానుంది.