కల్తీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు.. ఎనిమిది నెలలుగా.. ఏపీ బార్డర్‌లోని బెల్టు షాపుల్లో విక్రయాలు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాల గుట్టు వీడుతోంది.

Adulterated liquor
Adulterated liquor: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాల గుట్టు వీడుతోంది. తాజాగా ఈ అంశంపై ఎక్సైజ్ శాఖ ఎస్టీఎఫ్ సుపరిండెంట్ అంజిరెడ్డి 10టీవీతో మాట్లాడారు. ఇల్లీగల్‌గా ఎనిమిది నెలల నుండి కల్తీ మద్యంను బార్డర్‌లో ఉన్న ఏపీ గ్రామాల బెల్టు షాపులకు అమ్మకాలు చేస్తున్నారని అన్నారు.
హుజుర్‌నగర్ బార్డర్‌లో కల్తీ మద్యం దందాను మెడ శ్రీనివాస్ నడిపిస్తున్నాడు. కల్తీ మద్యం తయారీకి హైదరాబాద్ నుండి మెటీరియల్స్ సప్లయ్ అయ్యాయి. ఇందులో అబ్దుల్ కలాం అలియాస్ శ్రీనివాస్ ప్రధాన నిందితుడు. కల్తీ మద్యంలో రెండు బ్రాండ్లు తయారు చేస్తున్నారు. ఉప్పల్ కేంద్రంగా నడుస్తున్న శ్రీ కృష్ణ ఫార్మా నుండి అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్ తీసుకొచ్చి నకిలీ మద్యం తయారుచేసి అమ్ముతున్నారు. ఈ ఫార్మాలో స్పిరిట్ ను శానిటైజర్ తయారు చేయడంకోసం మాత్రమే అనుమతి తీసుకున్నారు. ఎక్కువ డబ్బులకోసం స్పిరిట్ తయారుచేసి ఇతరులకు అమ్మకాలు చేస్తున్నారని అంజిరెడ్డి తెలిపారు.
ఫార్మా కంపెనీపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. చరణ్ జిత్ ,శ్రీనివాస్ నవ్య ఏజెన్సీస్ పేరుతో స్పిరిట్ తీసుకొని లిక్కర్ తయారు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాల్లో బెల్ట్ షాప్‌లలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. ఏపీ పోలీసులు అమలాపురం, రాయపర్తి లాంటి ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. బెల్ట్ షాపులకు బాటిల్ 80రూపాయలకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో దీని విలువ 190పైన ఉంటుంది. 11వేల ఖాళీ బాటిల్స్, సీల్స్, బ్రాండ్ లేబుల్స్, ఎంసీ విస్కీ గల 38 కటన్స్‌ను సీజ్ చేశామని అంజిరెడ్డి చెప్పారు.
శృతి రైస్‌మిల్, రామాపురం హుజుర్‌నగర్‌లో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఏపీ బార్డర్‌లో ఈ కల్తీ మద్యం తయారు చేస్తుండడంతో సమాచారం ఆలస్యంగా వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నాం. నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తాం. కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. కల్తీ మద్యం విక్రయదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సుపరిండెంట్ అంజిరెడ్డి చెప్పారు.