Amit Shah On MinorityReservations : అధికారంలోకి వ‌చ్చాక‌.. మైనారిటీ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు-అమిత్ షా సంచలన ప్రకటన

మైనారిటీల‌కు కేటాయించిన రిజ‌ర్వేష‌న్ల‌పై అమిత్ షా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక మైనారిటీల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌న్నారు.(Amit Shah On MinorityReservations)

Amit Shah On MinorityReservations : అధికారంలోకి వ‌చ్చాక‌.. మైనారిటీ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు-అమిత్ షా సంచలన ప్రకటన

Amit Shah

Updated On : May 14, 2022 / 11:23 PM IST

Amit Shah On MinorityReservations : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఒక్కొక్కరుగా తెలంగాణలో వాలిపోతున్నారు. సభలు, సమావేశాలతో కమలనాథులు హోరెత్తిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా శనివారం హైదరాబాద్ శివారు తుక్కుగూడ (మహేశ్వరం)లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో నయా నిజాంను గద్దె దింపుదామా? వద్దా? అయితే మీరంతా పిడికిలి బిగించి నాతో ‘భారత్ మాతాకీ జై’ నినాదం చేయండి.. అంటూ పార్టీ కార్యకర్తల్లో షా ఉత్సాహం నింపారు.(Amit Shah On MinorityReservations)

ఈ సందర్భంగా తెలంగాణ‌లో మైనారిటీల‌కు కేటాయించిన రిజ‌ర్వేష‌న్ల‌పై అమిత్ షా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో మైనారిటీల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

Amit Shah : తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : అమిత్ షా

మైనారిటీ రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేసి… ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచుతామ‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు శ‌నివారం తుక్కుగూడ‌లో జ‌రిగిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు స‌మావేశంలో అమిత్ షా రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

కేసీఆర్ పాలనపై షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలాంటి అసమర్థ సీఎంను తన జీవితంలో చూడలేదని అన్నారు. కేసీఆర్‌ను, మజ్లిస్‌ను గద్దె దించిన రోజే తెలంగాణకు విమోచన అని అన్నారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్‌ను మజ్లిస్‌ను చూసి భయపడే ప్రసక్తే లేదన్నారు.

సంజయ్ పాదయాత్ర ఒక పార్టీకి వ్యతిరేకంగానో, ఒకరిని గద్దె దించాలనో ఉద్దేశించింది కాదని, కుటుంబ పాలనను అంతం చేయడానికి, రాష్ట్రంలో దళిత, గిరిజనుల కలలు సాకారం కావడానికి ఉద్దేశించింది అని అమిత్ షా అన్నారు.

కుటుంబానికి పదవులు ఇచ్చుకోవడం తప్ప కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు అమిత్ షా. తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అవినీతిమయమైన ప్రభుత్వాన్ని చూడలనే లేదన్నారు. వీళ్లను పీకి అవతల పారేస్తేగానీ తెలంగాణకు న్యాయం జరగదన్నారు. జనం దృష్టిని మరల్చడానికి కేసీఆర్ గిమ్మిక్కులు చేస్తారని అన్నారు. మోదీ వచ్చాకే దేశంలో కనీస మద్దతు ధర పెరిగింది, రైతులకు న్యాయం దక్కుతోందని షా అన్నారు. మారిన నిబంధనల మేరకు బాయిల్ రైస్ కొనాల్సిన బాధ్యత రాష్ట్రాలదే అని తేల్చి చెప్పారు. ఒకవేళ కొనడం చేతకాకపోతే, కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత ఏర్పడబోయే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం భేషుగ్గా బాయిల్ రైస్ కొంటుందన్నారు.