సీఎం రేవంత్ తెలంగాణను నక్సల్స్‌కు అడ్డాగా చేయొద్దు: నిజామాబాద్‌లో అమిత్ షా
పసుపు బోర్డు ఏర్పాటుతో ఇందూర్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనుంది.

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను నక్సల్స్‌కు అడ్డాగా చేయొద్దని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. నిజామాబాద్ రైతు సమ్మేళనం, జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.
తాము 2026 మార్చ్ 30లోగా నక్సల్స్ ను పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా తెలిపారు. “నక్సల్స్ రహిత దేశంగా మారుస్తాం. పోలీసులు, ఆదివాసీలపై దాడులు చేస్తున్న మావోయిస్టులను ఇంకా ఉపేక్షించం. కాంగ్రెస్ పాలనలో మనదేశంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు జరిగాయి. మోదీడీ ప్రధాని అయ్యాక తీవ్రవాదుల ఆటకట్టించారు.
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది. ధరణి.. కాళేశ్వరాన్ని.. తమకు అనుకూలంగా మార్చుకుంది. కేసీఆర్ ఫ్యామిలీ ఏటీఎంగా వాటిని మార్చుకుంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఢిల్లీకి ఏటీఎంగా మారింది. అవినీతిలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మించిపోతోంది. అవినీతి రహిత పాలన కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే.
Also Read: బిల్డ్ ఫర్ తెలంగాణ హ్యాకథాన్.. ప్రజా సమస్యలకు టెక్, ఇన్నోవేటివ్ పరిష్కారాలు..
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం. పసుపు బోర్డుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేర్చారు. పసుపు రాజధాని ఇందూరు. ఇక్కడి రైతుల పోరాటాన్ని గుర్తించిన మోదీ సర్కారు పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. పసుపు బోర్డు కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం.
తెలంగాణ పసుపు రైతులకు శుభాకాంక్షలు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఇందూర్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ ను పసుపు బోర్డు చేస్తోంది. ఇక్కడి పసుపుకి జియో ట్యాగింగ్ చేస్తున్నాం. 2030లోపు మిలియన్ డాలర్ పసుపు ఎక్స్‌పోర్ట్ అయ్యే ప్రణాళిక వేశాం.
పసుపు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. రానున్న 3 ఏళ్లల్లో పసుపు ధర 6-7 వేల రూపాయలు అధికం కానుంది. బోర్డు ద్వారా పసుపు ఉత్పత్తి కూడా పెరగనుంది. భారత కో అపరేటివ్ బ్రాంచ్, భారత్ కో అపరేటివ్ ఎక్స్‌పోర్ట్ బ్రాంచిలు ప్రారంభిస్తాం” అని అన్నారు.