Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..

మరికొన్ని రోజుల పాటు ఈ తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ విభాగం అధికారులు అంటున్నారు.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..

Weather Alert

Updated On : March 10, 2025 / 12:45 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ఠంగా 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మరోవైపు, రాత్రి సమయంలో మాత్రం ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. దీంతో రాత్రుళ్లు బయట చల్లని వాతావరణం ఉంటోంది. మధ్యాహ్నం సమయంలో పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, మంచిర్యాల, భూపాలపల్లి, భదాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మిగిలిన అన్ని జిల్లాల్లో సైతం దాదాపు 37 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.

మరికొన్ని రోజుల పాటు ఈ తీవ్రత ఇలాగే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ విభాగం అధికారులు అంటున్నారు. ఇప్పటికే రెండు జిల్లాలు మినహా దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ అయింది. ఎండల తీవ్రతని తట్టుకోవడం కోసం ప్రజలు చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

తగినంత నీరు తాగుతుండాలి. చల్లని ప్రదేశాల్లో ఉండాలి. తేలికపాటి, కాటన్ దుస్తులను ధరించాలి. పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవాలి, వడదెబ్బ తగిలితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి.