Mlc Kavitha : ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్.. అందుకు కోర్టు అనుమతి
ఇప్పటికే పలు అంశాలపై కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితను విచారించింది. ఇప్పుడు సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై కవితను ఎంక్వైరీ చేయనుంది.

Kavitha Cbi Custody
Mlc Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. కవితను సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ విచారించనుంది.
రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు తమ కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయనుంది. కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. కోర్టు 3 రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పలు అంశాలపై కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితను విచారించింది. ఇప్పుడు సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై కవితను ఎంక్వైరీ చేయనుంది.
సీబీఐ వాదనలు, రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుని కవితను మూడు రోజుల కస్టడీకి అనుమతించారు జడ్జి కావేరి బవేజా. తదుపరి విచారణను ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కవితకి వ్యతిరేకంగా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సప్ చాట్స్ సహా పలు ఆధారాలను కోర్టుకు సమర్పించింది సీబీఐ. కవితను 5 రోజుల కస్టడీకి సీబీఐ కోరగా 3 రోజుల కస్టడీకి అనుమతించి ఇచ్చింది కోర్టు.
లిక్కర్ పాలసీ రూపకల్పన అక్రమాల్లో కవిత సూత్రధారిగా సీబీఐ పేర్కొంది. కవిత, గోరంట్ల బుచ్చిబాబు (కవిత ఆడిటర్) ఫోన్ల వాట్సాప్ చాట్స్, కవిత పీఏ అశోక్ కౌశిక్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది. లిక్కర్ పాలసీ.. మద్యం వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడం, అందుకోసం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చడంలో కవిత కీలక సూత్రధారిగా పనిచేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సీబీఐ.
కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్ళై, అశోక్ కౌశిక్ పని చేసారంది సీబీఐ. లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, శరత్ రెడ్డి డబ్బు సమకూర్చారని పేర్కొంది. కవిత సహకారంతో ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి రిటైల్ జోన్స్ పొందారని ఇందుకోసం కవితకు డబ్బు ఇచ్చారని తెలిపింది. లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం ”తెలంగాణ జాగృతి” సంస్థ కోసం శరత్ చంద్ర రెడ్డి రూ.80 లక్షలు ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో సిబిఐ పేర్కొంది.
అరబిందో గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ఫండింగ్ కింద ఈ సొమ్ము ఇచ్చారంది. అందుకు ప్రతిఫలంగా శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ మద్యం వ్యాపారంలో అవకాశం కల్పిస్తానని కవిత హామీ ఇచ్చారంది. 2021 జూన్, జూలై నెలల్లో శరత్ చంద్రా రెడ్డికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒక ల్యాండ్ డీల్ లో కవిత చేర్చారంది. మహబూబ్ నగర్ లోని ఓ వ్యవసాయ భూమి కోసం సేల్ డీడ్ చేసి రూ.14 కోట్లు శరత్ చంద్ర రెడ్డి నుంచి కవిత తీసుకున్నారని తెలిపింది. ఈ సొమ్ము లావాదేవీలు బ్యాంకు ద్వారానే జరిగాయి. 2021 జులైలో రూ. 7 కోట్లు, అదే ఏడాది నవంబర్ లో మరో రూ. 7కోట్లు శరత్ చంద్రారెడ్డి చెల్లించారు. అరబిందో గ్రూపునకు చెందిన “మహిరా వెంచర్స్” పేరిట సేల్ డీడ్ జరిగిందని సీబీఐ వెల్లడించింది.
కవిత అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం- కవిత న్యాయవాదులు
కవిత సీబీఐ అరెస్ట్, కస్టడీని వ్యతిరేకిస్తూ కవిత న్యాయవాదుల వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఒక కేసులో అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో ఎలా అరెస్ట్ చేస్తారని కవిత న్యాయవాదులు ప్రశ్నించారు. కవిత అరెస్ట్ కు చూపుతున్న కారణాలన్నీ పాతవి.. కొత్తగా ఇప్పుడు కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి అన్నారు. ఇది PMLA కేసు కాదన్నారు. కవిత అరెస్ట్ కి రిమాండ్ లేదా అరెస్టుకు రిమాండ్ రిపోర్టు ఆధారమైతే, అది పూర్తిగా అన్యాయం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమన్నారు.
కవిత సమాధానం ఇవ్వనందున, సాక్ష్యం ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తామంటున్నారని.. కవితను అరెస్ట్ చేయడానికి ఎటువంటి కేసు లేదన్నారు. సెక్షన్ 41 దుర్వినియోగం చేయబడిందని, కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో కస్టడీలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కవిత జాతీయ రాజకీయ పార్టీకి సిట్టింగ్ మెంబర్‌ని, మాస్ పాపులర్ లీడర్ అని, మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని, ఈ సమయంలో కవిత అరెస్ట్ సరికాదని వాదనలు వినిపించారు.
అంతకు ముందు సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ తో పాటు, అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురు