Nandikanti Sridhar : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్, కీలక నేత రాజీనామా

Nandikanti Sridhar Resigns

Nandikanti Sridhar : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్, కీలక నేత రాజీనామా

Nandikanti Sridhar Resigns To Congress

Nandikanti Sridhar Resigns : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో కీలక నేత, డీసీసీ అధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ కాంగ్రెస్‌ కి రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారాయన. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హనుమంతురావుకు మల్కాజిగిరి టికెట్‌ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌ పెద్దలు చెప్పడంతో శ్రీధర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మల్కాజిగిరి కాంగ్రెస్ టికెట్ ను శ్రీధర్ ఆశించారు. తనకే టికెట్‌ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మైనంపల్లికి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటన రావడంతో శ్రీధర్ హర్ట్ అయ్యారు. పార్టీకి రిజైన్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో స్వయంగా రాహుల్ గాంధీ రెండు రోజుల కిందట శ్రీధర్ ని ఢిల్లీకి పిలిపించుకుని బుజ్జగించారు. అయినా తీవ్ర నిరాశకు గురైన నందికంటి శ్రీధర్‌ వెనక్కి తగ్గలేదు. డీసీసీ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్‌ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగదని భావించి తాను రాజీనామా చేసినట్లు లేఖలో తెలిపారు నందికంటి శ్రీధర్‌.

Also Read..BJP: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

ఓవైపు చేరికలు, మరోవైపు డిక్లరేషన్లు.. కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపింది. పలు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో తమకు తిరుగులేదని భావిస్తున్న వేళ కాంగ్రెస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నారు.

బీఆర్ఎస్ మాజీ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతురావు కాంగ్రెస్‌లో చేరడం, మల్కాజిగిరి టికెట్ ఆయనకే ఇస్తామని కాంగ్రెస్ చేసిన ప్రకటనతో తీవ్ర అసంతృప్తికి గురైన నందికంటి శ్రీధర్.. హస్తం పార్టీకి రాజీనామా చేసేశారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి, నియోజకవర్గంలో పార్టీని లేకుండా చేయాలని చూసిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ తనకు తప్పకుండా మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ వస్తుందని ఆశించిచానని.. కానీ టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

”నందికంటే శ్రీధర్ అనే నేను.. బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. 1994 నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్నా. పార్టీలు మారకుండా కాంగ్రెస్ కి విధేయుడిగా ఉంటూ వస్తున్నా. పార్టీకి ఎంతో సేవ చేశా. 2018లో టికెట్ వస్తుందని ఆశించా. కానీ పొత్తుల కారణంగా టికెట్ రాలేదు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం కుటుంబానికి ఒకే సీటు నిర్ణయాన్ని స్వాగతించి.. ఈ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని భావించా. కానీ ఇప్పుడు మల్కాజిగిరి, మెదక్ టికెట్లను ఒకే కుటుంబానికి కేటాయించారు.

Also Read..Jagtial: జగిత్యాల త్రిముఖపోరులో గట్టెక్కేదెరో.. జీవన్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా?

ఎన్నో ఏళ్ల నుంచి మల్కాజిగిరికి చెందిన కాంగ్రెస్ నేతలు.. మైనంపల్లి హనుమంతరావుతో పోరాడారు. వారిపై అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. నేడు అదే వ్యక్తిని కాంగ్రెస్ లో చేర్చుకుని మాకు అన్యాయం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఇద్దరికి టికెట్లు ప్రకటించి కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది. ఓసీ అభ్యర్థికి సీటు ప్రకటించి, బీసీ అభ్యర్థులకు అన్యాయం చేసింది. అందుకే డీసీసీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా” అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు నందికంటి శ్రీధర్.

బీఆర్ఎస్ లో తనకు రెండు టికెట్లు దక్కకపోవడంతో మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలను తనకి తన కుమారుడికి ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చాకే ఆయన కాంగ్రెస్ లో చేరారు. కాగా, మైనంపల్లి రాక మల్కాజిగిరి కాంగ్రెస్ లో చిచ్చు రాజేసింది. కీలక నేత రాజీనామాకు దారితీసింది.