ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు.. తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు..
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ శ్రేణులతో సమావేశం అయ్యారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు.

AP CM Chandrababu Naidu
Cm Chandrababu Naidu: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ శ్రేణులతో సమావేశం అయ్యారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీగా చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. అనంతరం అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గెలుపు కోసం మీరంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టింది తెలంగాణ గడ్డపైనే. తెలుగు జాతికి అన్యాయం జరిగింది.. నా జాతిని కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంగా ఎన్డీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు మీ ఉత్సాహం చూస్తుంటే మళ్లీ తెలంగాణ గడ్డపైన తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమని చంద్రబాబు అన్నారు.
Also Read : CM Revanth Reddy : రేపు ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
నాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కళ్లులాంటివి. విభజన సమయంలోనూ తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల ప్రయోజనాలకోసం పనిచేసింది. విభజన పూర్తయిన తరువాతకూడా తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆరోజు ఆలోచించా.. ఈరోజు అదే ఆలోచిస్తున్నా. నా చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు అదే ఆలోచిస్తానని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదు. తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. తొందరలోనే పార్టీ బలోపేతంపై దృష్టిపెడతామని చంద్రబాబు తెలిపారు. యువకులు, ఉత్సాహవంతులతో రాబోయే కాలంలో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు.
Also Read : నాసా హెచ్చరిక.. భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏం జరగనుందంటే?
గత ఏపీ ప్రభుత్వం ఏ కారణం లేకుండా నన్ను జైల్లో పెట్టారు. ఆ సమయంలో హైదరాబాద్ లో నాకోసం మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు రోడ్లపైకొచ్చారని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి ఎన్టీఆర్ ను ఎప్పుడూ మరిచిపోలేరు. అదేసమయంలో ఈదేశానికి ఒక దశదిశ చూపించిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని చంద్రబాబు అన్నారు. 1991లో పీవీ నర్సింహారావు మొట్టమొదటి సారిగా ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. అప్పటి నుంచి దేశంలో సంపద సృష్టించడం సులభమైందని, ఎన్టీఆర్, పీవీ నర్సింహారావు లాంటి వ్యక్తులు ఈ గడ్డపై పుట్టడం తెలుగువారి అదృష్టమని చంద్రబాబు అన్నారు.
రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు..
అప్పట్లో.. హైదరాబాద్ అభివృద్ధిని హైటెక్ సిటీతో ప్రారంభించాను. నిన్న ఫ్లైట్ లో వస్తూ హైటెక్ సిటీ చూసి చాలా ఆనందం కలిగింది. ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. హైదరాబాద్ అభివృద్ధిని తరువాత వచ్చిన ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కొనసాగించారని చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాల విభజన అంశాల పరిష్కరానికి నేనే చొరవ తీసుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశాను. సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి జరగలన్నదే టీడీపీ అభిమతం. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే నాకు ముఖ్యం. తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం అవుతాయని భావిస్తున్నాను. తెలంగాణ ఒకస్థాయికి వచ్చింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే భాద్యత నేను తీసుకుంటాను. 2047కు భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గా ఉంటుంది. దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఉండాని నా ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు. మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని కోరుకుంటానని చంద్రబాబు అన్నారు.