హైదరాబాద్‌లో ర్యాలీ వద్దన్న ఏపీ సీఎం చంద్రబాబు.. కొద్ది మంది తెలంగాణ నేతలతో భేటీ

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వస్తున్న చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి.

హైదరాబాద్‌లో ర్యాలీ వద్దన్న ఏపీ సీఎం చంద్రబాబు.. కొద్ది మంది తెలంగాణ నేతలతో భేటీ

AP CM Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని మరికాసేపట్లో హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, తోరణాలతో ఈ రూటు పసుపు మాయంగా మారింది.

బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీగా చంద్రబాబును ఆయన నివాసానికి తోడ్కోని పోవాలని టీడీపీ నాయకులు భావించారు. నగర వాసులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ర్యాలీ వద్దని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. బేగంపేట నుంచి నేరుగా తన కాన్వాయ్‌లో నివాసానికి ఆయన చేరుకుంటారు.

ఎయిర్‌పోర్టులోకి కొద్ది మంది నాయకులను మాత్రమే అనుమతించనున్నారు. 40 మంది తెలంగాణ తెలుగుదేశం నాయకులకు మాత్రమే చంద్రబాబును కలిసేందుకు అనుమతిస్తారని సమాచారం. వారితో మాట్లాడిన తర్వాత ర్యాలీ లేకుండానే చంద్రబాబు తన నివాసానికి వెళ్లిపోతారు. కాగా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.

Also Read : తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముద్రగడ పద్మనాభం భేటీ

రేవంత్ రెడ్డితో రేపు భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రేపు ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ లో ఈ సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. ముఖ్యనేతల మధ్య జరిగే సమావేశానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.