Hyderabad : సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్‌లు

ఉపాధి, ఉద్యోగం, విద్య నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న వారు తమ తమ సొంతూళ్లకు బయలుదేరారు.

Hyderabad : సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్‌లు

Hyderabad Bus Stands

హైదరాబాద్ నగర వాసులు సొంతూళ్లకు పయనం అయ్యారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసేందుకు గ్రామాలకు వెళ్తున్నారు. ఉపాధి, విద్య నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న వారు తమ తమ సొంతూళ్లకు బయలుదేరారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది.

తెలంగాణలో రేపు(నవంబర్ 30) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఓటు వేసేందుకు నగరంలో ఉంటున్న వారు సొంత ఊళ్లకు పయనం అయ్యారు. వేర్వేరు పనుల నిమిత్తం అనేక మంది హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ లో ఉంటున్నా ఓటు హక్కు మాత్రం సొంత ఊరిలోనే ఉంది. దీంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పల్లెబాట పట్టారు జనం.

Also Read : చిరంజీవి..నాగార్జున..మహేష్ బాబు.. ప్రభాస్.. సినీ ప్రముఖులు ఓటు వేసే ప్రాంతాలు ఇవే..

సహజంగా పండుగల సమయంలో మాత్రమే హైదరాబాద్ లో ఉండే వారంతా సొంతూళ్లకు వెళ్తారు. పండుగల సమయంలో మాత్రమే రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లలో విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. అయితే ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు పల్లెబాట పడతారు. ఈసారి కూడా నగరంలో ఉంటున్న వారు తమ ఊళ్లకు పయనం అయ్యారు.

సహజంగానే ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి కొంత టైట్ సిచువేషన్ ఉంటుంది. ఒకవైపు ఎన్నికల నిర్వహణకు బస్సులను వినియోగిస్తూనే మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ప్రయాణికుల సౌకర్యం కోసం సిటీలో తిరిగే బస్సులను కూడా జిల్లాలకు మళ్లిస్తున్నారు అధికారులు.

Also Read : పోలింగ్‌పై ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా నగర ఓటర్ల ఉదాశీనత.. అత్యల్ప ఓటింగ్

”ప్రతిరోజూ ఎంజీబీఎస్ నుంచి 3వేల 500 బస్సులు వెళ్తుంటాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అదనంగా వెయ్యి బస్సు సర్వీసులు ప్లాన్ చేశాము. సుమారు 4వేల 500 బస్సులు ప్లాన్ చేశాం. మహబూబ్ నగర్, ఖమ్మం సెక్టార్ కు వచ్చే సరికి హెవీ ట్రాఫిక్ ఉంది. దాని కోసం సిటీ నుంచి 62 బస్సులు అదనంగా పంపించాం. వీలైనంత తొందరగా బస్టాండ్ ల నుంచి ప్రయాణికులను వారి వారి సొంతూళ్లకు పంపేందుకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సిబ్బంది అంతా పని చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. సుమారుగా 3లక్షల మంది ప్రయాణికులు ఎంజీబీఎస్ నుంచి ప్రయాణం చేస్తారని అంచనా వేశాము” అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.