Revanth Reddy : నెలకు 4వేలు పెన్షన్ కచ్చితంగా ఇస్తాం, ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధం- రేవంత్ రెడ్డి
Revanth Reddy : ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పేపర్లు, టీవీలు, ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు రాహుల్ గాంధీని అడ్డుకుంటారా?

Revanth Reddy (Photo : Twitter)
Revanth Reddy – Pension : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మరింత వేడి పెంచాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా రాహుల్ గాంధీ విమర్శలు చేయగా.. అధికార పార్టీ నేతలు అదే రేంజ్ లో ఎదురుదాడికి దిగారు. తాజాగా ఈ వ్యవహారంలో మరింత దూకుడు పెంచారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చారు.
” ఖమ్మం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ఏర్పాటుకు రాహుల్ సహకరించారు. ఖమ్మం సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసింది. సభను అడ్డుకోవడానికి అధికారులు ప్రయత్నించడం దారుణం. తాగడానికి నీళ్లు సరఫరా చేయకపోవడం సిగ్గుచేటు. అక్కడున్న సైకో మంత్రి సైకో విన్యాసాలన్నీ చేశాడు. పదవులను త్యాగం చేసిన నాయకుడు రాహుల్ గాంధీ.(Revanth Reddy)
ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పేపర్లు, టీవీలు, ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు రాహుల్ గాంధీని అడ్డుకుంటారా? తెలంగాణలో పర్యటించడానికి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ అర్హత ఎవరికి ఉంది? ఒకరు పిట్టల దోర, మరొకరు ట్విట్టర్ పిట్ట, ఇంకొకరు సారా పోసే మంత్రి. కాంగ్రెస్ చెప్పినదానికంటే చేసింది ఎక్కువ. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన ఒక్క విషయమైనా చెప్పాలి. కల్వకుంట్ల కుటుంబం ఫామ్ హౌజ్ లు కట్టుకోవడం మీడియా ఛానల్స్ లో పెట్టుబడులు పెట్టడం తప్పా చేసింది ఏమైనా ఉందా?
కాళేశ్వరంపై హరీశ్ రావుతోనైనా కేటీఆర్ తోనైనా చర్చకు నేను సిద్దం. నా సవాల్ ను కేటీఆర్, హరీశ్ స్వీకరిస్తారా? కల్వకుంట్ల కుటుంబానికి కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ లాగా మారింది. బీజేపీ+బీఆర్ఎస్=బై బై. రాహుల్ గాంధీ ఏమైనా తప్పులు మాట్లాడినట్టు ఉంటే ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధం. మేం ఉండే వేదికపైకి బీఆర్ఎస్ ను రానివ్వం అని రాహుల్ చెప్పారు. మా విధానం మేం చెప్తే మీకెందుకు బాధ? ఎన్ని ఆంక్షలు పెట్టినా ఖమ్మం సభకు ప్రజలు తొక్కుతుంటూ వచ్చారు.
75 రూపాయలున్న పెన్షన్ ను రూ.200 చేసింది మేమే. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా 4వేల పెన్షన్ ఇస్తాం. రాష్ట్ర ఆదాయం పెరిగింది. ఎలా అమలు చేయాలో మాకు తెలుసు. 4వేల పెన్షన్ పై అనుమానాలుంటే చర్చ పెట్టండి. మేం అవగాహన కల్పిస్తాం. కేసీఆర్ అవినీతి ఆపేస్తే పథకాలకు డబ్బులు ఇవ్వొచ్చు. రాష్ట్రాల పరిస్థితులను బట్టి పాలసీలు ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఆరోపణలు వచ్చిన వాళ్ళని విచారించి జైలుకు పంపింది కాంగ్రెస్ పార్టీ” అని రేవంత్ రెడ్డి అన్నారు.