మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై రాళ్ల దాడి

దీంతో ఇద్దరి తలలకు గాయాలు కాగా, వారిలో ఒకరి కాలు కూడా విరగడంతో ఆసుపత్రికి తరలించారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై రాళ్ల దాడి

ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్న వేళ మంచి కంటి నగర్‌లో ఉద్రిక్తత చెలరేగింది. పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై కొందరు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరి తలలకు గాయాలు కాగా, వారిలో ఒకరి కాలు కూడా విరగడంతో ఆసుపత్రికి తరలించారు.

బాధితులను పరామర్శించనివ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలే దాడులకు దిగుతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ కు తీవ్రగాయాలు అయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించుకుండా కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ నేత మిక్కిలినేని నరేంద్ర ఆధ్వర్యంలోనే దాడులు చేశారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవాలని కోరుతుంటే తమపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఈ పర్యటనలో మాజీ మంత్రులు హారీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఖమ్మం మున్నేరు వరద బాధితులను పరామర్శించారు.

కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి వంగ్యం ఎక్కువ, పరిపాలన సామర్థ్యం తక్కువని చెప్పారు. వాతావరణ శాఖ ముందుగా చెప్పినా ప్రభుత్వం స్పందించ లేదని, అన్ని తడిసిపోయాయని, విద్యార్థుల సర్టిఫికేట్లు పోయాయని అన్నారు. వరద సహాయక చర్యల్లో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని, ముంపు ప్రాంతాల ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చామని తెలిపారు.

మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చాం: హరీశ్ రావు