Bandi Sanjay: చేపల పులుసే కొంప ముంచింది: బండి సంజయ్
తన బండారం బయటపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో..

Bandi Sanjay Kumar
Bandi Sanjay: కృష్ణా జలాల వాటా విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కనబర్చిన తీరుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ రైతు సదస్సు నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రులు కైలాశ్ చౌదరి, కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మురళీదరరావు, పొంగులేటి, ఎస్.కుమార్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… చేపల పులుసే కొంప ముంచిందని ఎద్దేవా చేశారు. దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ మోసం చేశారని, కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు రావాల్సిన చోట 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టారని, చేపల పులుసు తిని ఆ పని చేశారని అన్నారు.
కేంద్రం కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయటంతో తన బండారం బయటపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో కేసీఆర్ కుమ్మక్కై దక్షిణ తెలంగాణకు ద్రోహం చేశారని అన్నారు. ఎన్నికలు ముగిశాక కేసీఆర్ రైతుబంధును ఆపేస్తారని ఆరోపించారు.
ఎన్నికల వేళ కేసీఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని రైతులకు సూచించారు. కేంద్ర సర్కారు మోటార్లకు మీటర్లు ఎక్కడ పెట్టిందో చూపించాలని బీఆర్ఎస్ కు సవాలు విసిరారు. కేంద్ర సర్కారు పేరుతో కేసీఆర్ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో తెలంగాణ రైతులు బీజేపీకే ఓటు వేయాలని కోరారు.