Bathukamma Sambaralu : 21నుంచి బతుకమ్మ సంబురాలు.. కార్యక్రమాల షెడ్యూల్ విడుదల.. 28న అక్కడ గిన్నిస్ రికార్డ్ స్థాయిలో వేడుకలు..
Bathukamma Sambaralu : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.

Bathukamma Sambaralu
Bathukamma Sambaralu : బతుకమ్మ సంబురాల (Bathukamma Sambaralu)ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలను జరపనుంది. ఈ మేరకు కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 21వ తేదీన వరంగల్ జిల్లా వేయి స్తంభాల గుడిలో వేడుకలను ప్రారంభించి.. 30న హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ముగింపు వేడుకలు జరపనున్నారు.
Also Read: Mahakali Devi Temple: అయుష్షును పెంచే మహాకాళీ దేవి.. భయాల నుంచి విముక్తి
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకమయ్యేలా వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సంబురాల్లో భాగంగా సాంస్కృతిక కళాసారథుల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. హైదరాబాద్‌లో ఎంపిక చేసిన జంక్షన్లు, టూరిజం హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, యూనివర్శిటీల్లో బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పాలని అధికారులకు మంత్రి సూచించారు.
సంబురాల షెడ్యూల్ ఇలా..
♦ ఈనెల 21న సాయంత్రం వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం. అదేరోజు ఉదయం హైదరాబాద్ శివారులో మొక్కలు నాటే కార్యక్రమం.
♦ 22న హైదరాబాద్ శిల్పారామం. మహబూబ్ నగర్ పిల్లలమర్రి వద్ద బతుకమ్మ వేడుకలు.
♦ 23న నాగార్జున సాగర్ బుద్ధవనం వద్ద.
♦ 24న జయశంకర్ జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఆవరణంలో, కరీంనగర్ ఐటీ సెంటర్లో.
♦ 25న భద్రాచలం ఆలయం వద్ద, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో బతుమకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు.
♦ 25 నుంచి 29వ తేదీ వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ ఉంటుంది.
♦ 26న నిజామాబాద్ అలీసాగర్ రిజర్వాయర్, అదిలాబాద్, మెదక్ జిల్లాల్లో సంబురాలు జరుగుతాయి. అదేరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉదయం సైకిల్ ర్యాలీ ఉంటుంది.
♦ 27వ తేదీ ఉదయం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద మహిళల బైక్ ర్యాలీ. సాయంత్రం ఐటీ కారిడార్‌లో బతుకమ్మ కార్నివాల్.
♦ 28వ తేదీన ఎల్బీ స్టేడియంలో 10వేలకుపైగా మహిళలతో గిన్నీస్ రికార్డ్ సాధించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహణ. 50 అడుగుల ఎత్తున బతుకమ్మను అలంకరించనున్నారు.
♦ 29న పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీలు. డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో సరస్ ఫెయిర్. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆర్‌డబ్ల్యూఏ , హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్ ప్రైజస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు, పోటీలు.
♦ 30న ట్యాంక్‌బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్. వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ప్లోట్స్, ఇకెబానా, జపనీయుల ప్రదర్శన నిర్వహిస్తారు. రాత్రికి సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్ లేజర్ షోతో సంబురాలు ముగుస్తాయి.