బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా.. “స్థానిక” ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టేకి నిరాకరణ.. వాదనలు ఎలా జరిగాయంటే?
ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.

Telangana High Court
BC reservations: హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల విచారణ రేపటికి వాయిదా పడింది. ఇవాళ ఇరు వర్గాల వాదనలు జరిగాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై పిటిషనర్ స్టే కోరారు. అయితే, స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. “దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లును సమర్థించాయి. చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదు. కాకపోతే చట్టం ఆధారంగా జారీ చేసిన జీఓలను ఛాలెంజ్ చేశారు. జీఓకు మూలమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను మాత్రమే ఛాలెంజ్ చేయడం కుదరదు.
రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితి 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు ఆదేశమే తప్పితే రాజ్యాంగంలో ఎక్కడా ఎలాంటి నిబంధన ఈ పరిమితి విధించలేదు. డేటా ఆధారంగా ప్రభుత్వానికి, శాసన వ్యవస్థకు తగిన నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. 2018లో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం పాసైన సమయంలో ఈ కసరత్తు జరగలేదు. 2019లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
Also Read: భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది నిజమే.. మేము ఇలా చేస్తాం: పాకిస్థాన్ రక్షణ మంత్రి
ఫలితంగా మొత్తం రిజర్వేషన్లు 50% దాటి అదనంగా 10%.. అంటే మొత్తం రిజర్వేషన్ల శాతం 60 శాతానికి చేరుకుంది. ఎంపిరికల్ డేటా ఉంటే గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. గవర్నర్ కి పంపిన బిల్లును ఆమోదించలేదు, అలాగని వెనక్కి పంపనూ లేదు. గవర్నర్ కి బిల్లును పంపి నెల కాదు, 6 నెలలు గడిచాయి.
చట్టాన్ని సవాల్ చేయకుండా.. కేవలం ఆ చట్టం ఆధారంగా జారీ చేసిన జీవోపై మాత్రమే అభ్యంతరాలు చెబుతూ పిటిషనర్ల వాదనలు జరిగాయి. బిల్లులు పాస్ చేసే విషయంలో చట్ట సభల్లో భిన్నాభిప్రాయాలు, గొడవలు ఉంటాయి.
కానీ ఈ బిల్లును అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఆమోదించి పాస్ చేశాయి. లక్ష మంది ఎన్యుమరేటర్లు సమగ్రంగా సర్వే నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల పై అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయి జీఓపై స్టే ఇవ్వాలని కోరడం సరైంది కాదు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది” అని అభిషేక్ సింఘ్వీ అన్నారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఏమన్నారు?
పిటిషనర్ తరఫు న్యాయవాది మయూర్ రెడ్డి మాట్లాడుతూ… “రాజ్యాంగం ప్రకారం అన్ని రిజర్వేషన్లు 50 శాతం మించి ఉండరాదు. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు. గవర్నర్ దగ్గరికి బిల్ వచ్చినప్పుడు నెల రోజుల్లో యాక్షన్ తీసుకోవాలి.
ఒకవేళ గవర్నర్ యాక్షన్ తీసుకోకుంటే మూడు నెలల్లోపు క్యాబినెట్ ముందుకు పంపాలి. క్యాబినెట్ నుంచి మళ్లీ గవర్నర్ బిల్ వెళితే దాన్ని గవర్నర్ ఆమోదించాలి. కానీ ఇక్కడ బిల్ ఇంకా మొదటి దశలోనే ఉంది. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే జీఓ 9ను తీసుకొచ్చారు” అని తెలిపారు.
హైకోర్టు ప్రశ్నలు
విచారణ సందర్భంగా హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. “గవర్నర్ బిల్లును ఆమోదించలేదు కాబట్టి.. బిల్లుకు ఆమోదం లభించినట్టుగా భావిస్తూ ప్రభుత్వం నోటిఫై చేసిందా? ఎక్స్‌ట్రా ఆర్డినరీ గెజిట్‌లోనే నోటిఫై చేసినప్పుడు మాత్రమే దాన్ని చట్టంగా పరిగణించగలం కదా? బిల్లులో తీసుకొచ్చిన సవరణలనే తర్వాత ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చారా? కమిషన్ డేటాను పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదా? ప్రజల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించిందా? ఈ మేరకు కొన్ని తీర్పులున్నాయి కదా?” అని ప్రశ్నించింది. చివరకు విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.