ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారు రైతు భరోసాకు అనర్హులా..? క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల

అందరి అభిప్రాయాలు తీసుకుని విధివిధానాలు నిర్ణయించి ప్రభుత్వంకు నివేదిక అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారు రైతు భరోసాకు అనర్హులా..? క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల

Minister Thummala

Rythu Bharosa : రైతు భరోసా పథకంపై విధివిధానాలను ఖరారు చేసేందుకు నలుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ఉన్నారు. జిల్లాల వారిగా మంత్రుల సబ్ కమిటీ సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ క్రమంలో తొలుత ఖమ్మం జిల్లా నుంచి రైతు భరోసా సమావేశాలకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, మంత్రులు మాట్లాడారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉందని చెప్పారు. త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నారు. రైతు భరోసా పథకం అమలుకోసం ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించి ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. అందరి అభిప్రాయాల మేరకు విధివిధానాలు నిర్ణయించి ప్రభుత్వంకు నివేదిక అందిస్తామని భట్టి అన్నారు. రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుంటామని, రాజకీయాలకు అతీతంగా రైతుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని భట్టి చెప్పారు.

Also Read : జగన్ రాజీనామా వార్తలపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి.. ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం మీ ఆలోచనలు ప్రకారమే ముందుకు వెళ్తుంది. మీరిచ్చే సూచనలు రైతులకు భరోసా కల్పించాలి. గతంలో జరిగిన ఆర్థిక నష్టం మీ అందరికీ తెలుసు. సన్న, చిన్నకారు రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. గతంలో రైతు బంధు కష్టం అయినా 7వేల కోట్లు ఇచ్చాం. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తాం. శాసనసభ సమావేశాలలోపే అన్ని జిల్లాల్లో సబ్ కమిటీ సమావేశాలు పూర్తిచేస్తామని తుమ్మల అన్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి రైతు భరోసా ఇవ్వరు.. వారు రైతు భరోసాకు అనర్హులు అనేది ప్రచారం మాత్రమేనని మంత్రి తుమ్మల అన్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వేరు.. ఐటీ చెల్లించటం వేరు. పిల్లల చదువులకోసం, ఇతరత్రా పనులకోసం రైతాంగం ఐటీ రిటర్న్స్ కోసం ధరఖాస్తు చేసుకుంటారు. అటువంటి వారికి ఎటువంటి నష్టం జరగదు. ఐటీ చెల్లిపులు ఎవరైతే చెల్లిస్తున్నారో వారిని మాత్రమే పరిగణలో తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు.

Also Read : భయమా, అనుమానమా.. చంద్రబాబు, రేవంత్ భేటీపై కాంగ్రెస్ నేతలకు అభ్యంతరం ఎందుకు?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలు నుండి వస్తున్న పన్నులు. గత ప్రభుత్వం ఎవరి అభిప్రాయం తీసుకోకుండా.. నాలుగు గోడలు మధ్య నిర్ణయం తీసుకుని ప్రజల మీద రుద్దింది. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రతి పైసకి మేము బాధ్యులం. ప్రజలకి చెప్పాలిన బాధ్యత మాపై ఉంది. ప్రభుత్వం రైతు బంధు విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సబ్ కమిటీగా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో రైతులు, ప్రజల అభిప్రాయం  తీసుకుంటాం. వారి అభిప్రాయాల నివేదికను అసెంబ్లీలో పెట్టి నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి అన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కొన్ని రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్లు అన్ని విషయాలు అసెంబ్లీలో ప్రస్తావిస్తే చర్చిద్దాంమని పొంగులేటి అన్నారు.