జగన్ రాజీనామా వార్తలపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి.. ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు
పేద వారికి ఉచిత ఇసుకను ప్రభుత్వం అందిస్తే మంచిదే. మేము కూడా దీనిని స్వాగతిస్తున్నాం. వైసీపీ నేతలు ఇసుక అక్రమాలకు పాల్పడ్డారన్నది కాకుండా..

YV Subbareddy
YV Subba Reddy : విభజన హామీలను నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వాటిపై పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి ఒంగోలులోని తన నివాసానికి సుబ్బారెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల పంపకాలు, వివాదాలు పరిష్కరించుకునేందుకు ఇద్దరు సీఎంలు భేటీ కావడం మంచి పరిణామమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నారు. ఏపీలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాలని, ఆమేరకు ప్రభుత్వం కేంద్రంతో పోరాడాలని సుబ్బారెడ్డి అన్నారు.
Also Read : వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు
పేద వారికి ఉచిత ఇసుకను ప్రభుత్వం అందిస్తే మంచిదే. మేము కూడా దీనిని స్వాగతిస్తున్నాం. వైసీపీ నేతలు ఇసుక అక్రమాలకు పాల్పడ్డారన్నది కాకుండా.. తాము తీసుకొచ్చిన ఇసుక పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం ఎంత వచ్చిందనేది ప్రస్తుత ప్రభుత్వం చూడాలి. ఆ దిశగా విచారణ చేసుకోవాలని ప్రభుత్వానికి సుబ్బారెడ్డి సూచించారు. టీడీఆర్ బాండ్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ చేసుకోవచ్చు. విచారణలో తప్పులు చేసి ఉంటే భాద్యులైనవారిపై చర్యలు తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదని వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు టీడీఆర్ బాండ్ల విషయంలో ఎక్కడైన అక్రమాలు జరిగాయని అనుకోవడంలేదు. టీడీఆర్ బాండ్లలో అక్రమాలు జరిగిఉంటే ఈ ప్రభుత్వం నిరూపించాలంటూ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : హైకోర్టును ఆశ్రయించిన సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఎందుకంటే..
మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. జగన్ రాజీనామాపై వస్తున్న వార్తలు పూర్తిగా అబద్దం. రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేనప్పుడు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.