ఆ వివరాలన్నీ ఒకే పేజీలో ఉండేలా భూభారతి కొత్త పోర్టల్.. ధరణి పోర్టల్‌ను పూర్తిగా రద్దు చేస్తాం: పొంగులేటి
ఇప్పుడు ఉన్న 2.29 కోట్ల సర్వే నంబర్లకు విడతల వారీగా భూధార్ కార్డులను ఇస్తామని చెప్పారు.
ponguleti srinivas reddy
Bhoobharati: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న భూభారతి కొత్త పోర్టల్ గురించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరాలు తెలిపారు. సంక్రాంతి నాటికి ధరణి పోర్టల్‌ను పూర్తిగా రద్దు చేస్తామని అన్నారు. ఆ తర్వాత రెవెన్యూతో పాటు సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల వివరాలన్నీ
ఒకే పేజీలో ఉండేలా భూభారతి పోర్టల్‌ను తీసుకొస్తామని తెలిపారు.
ఇప్పుడు ఉన్న 2.29 కోట్ల సర్వే నంబర్లకు విడతల వారీగా భూధార్ కార్డులను ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ముగిశాక.. ఇటీవల రీ సర్వే చేపట్టిన 5 గ్రామాల రైతులకు భూధార్ కార్డులు ఇస్తామన్నారు.
భూభారతి కొత్త పోర్టల్ అన్నదాతలకు మెరుగైన సర్వీసులు అందిస్తుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 373 గ్రామాల్లో రెండో విడత కింద సర్వే నిర్వహిస్తామని తెలిపారు.
మూడో విడతలో అన్ని జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేస్తామని, సర్వే చేసిన తర్వాత భూదార్ కార్డులు ఇస్తామని వివరించారు. భూ సమస్యల విషయంలో వచ్చిన దరఖాస్తుల్లో అర్హత ఉన్న వాటిని జనవరి చివరిలోగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.
బీఆర్‌ఎస్ పాలన నుంచి జరిగిన అక్రమాలను గుర్తించేందుకు రెండు జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోందని తెలిపారు. వాటిని పరిశీలించి తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు. అవినీతి పరులను గుర్తిస్తామని చెప్పారు. సాదాబైనామా దరఖాస్తుల్లో సర్కారు భూములు ఉంటే వాటిని క్రమబద్ధీకరణ చేయబోమని తెలిపారు.
