Bird Flu: తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభణ.. రెండు లక్షల కోళ్లను పూడ్చేసిన అధికారులు

తెలంగాణలో బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తోంది. లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.

Bird Flu: తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభణ.. రెండు లక్షల కోళ్లను పూడ్చేసిన అధికారులు

Bird Flu

Updated On : March 23, 2025 / 9:10 AM IST

Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తోంది. గత నెలలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోళ్లఫామ్ యాజమానులను, ప్రజలను అప్రమత్తం చేసింది. తద్వారా అధికారులు బర్డ్ ఫ్లూ పై ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే, కొద్దిరోజులకే బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిపోవటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా.. మరోసారి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. వరుసగా లక్షలాది కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నాయి.

 

యాదాద్రి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని ఓ కోళ్లఫామ్ లో ఇటీవల వందల కోళ్లు చనిపోయాయి. విషయం తెలుసుకున్న వెటర్నరీ అధికారులు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపడంతో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు రెండు రోజుల క్రితం సుమారు 40వేల కోళ్లను చంపేసి సంచుల్లో ప్యాక్ చేసి అనంతరం గొయ్యితీసి పూడ్చేశారు. ఫాంలోని దాదాపు 20వేల కోడిగుడ్లను, కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను కూడా గొయ్యిలో పూడ్చిపెట్టారు. కోళ్ల ఫామ్ లో ఉన్న దాణాను సీజ్ చేశారు.  అయితే, తాజాగా.. నల్గొండ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి.

 

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలో రెండు లక్షలకుపైగా ఉండే ఓ కోళ్ల ఫారంలోని గుడ్లు ఉత్పత్తి చేసే కొన్ని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కోళ్ల ఫామ్ లో గత మూడు రోజుల నుంచి కోళ్లు మృతి చెందుతుండగా పశువైద్య శాఖ అధికారులు వైద్య పరీక్షలు చేశారు. మృతిచెందిన కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించి పరీక్షించడంతో బర్డ్ ఫ్లూ వ్యాధితోనే కోళ్లు మృతి చెందినట్లు తేలింది. దీంతో ఫారంలోని మిగిలిన కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకకముందే వాటిని పూడ్చివేశారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ కు మూడు కిలో మీటర్ల వరకు వ్యాధి ప్రభావిత జోన్ గా ప్రకటించారు.

 

రాష్ట్రంలో ప్రస్తుతం నమోదైన మూడు బర్డ్ ఫ్లూ కేసులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనివే కావటంతో చికెన్ ప్రియులు, ఫౌల్ట్రీ ఫారాల యాజమానులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉంటే.. గత నెలలో చౌటుప్పల్ మండలం నేలపట్లలో రాష్ట్రంలోనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా హైదరాబాద్ కు సమీపంలో ఉంది. ఇక్కడి ఫౌల్ట్రీ ఫారాల నుంచే పెద్దెత్తున చికెన్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతుంది. ఈ క్రమంలో గత నెలలో హైదరాబాద్ లో చికెన్ విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. ఇటీవల బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గడం, రంజాన్ మాసం కావడంతో చికెన్ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ బర్డ్ ఫ్లూ విజృంభిస్తుండటంతో పౌల్ట్రీ యాజమానులు దిక్కుతోచని స్థితిలో ఉండగా.. చికెన్ ప్రియులు ఆందోళ చెందుతున్నారు.