Raja Singh: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..! మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు..
ఆయనకు కళ్లు ఉన్నా చూడరు, నోరు ఉన్నా మాట్లాడరు అంటూ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

Raja Singh: బీజేపీ నేత, గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీరు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరోసారి రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకోబోతోందంటూ ఆయన పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో జూబ్లీహిల్స్ టికెట్ రెడ్డి సామాజికవర్గానికే అంటూ పార్టీలో చర్చ మొదలైంది.
మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక 6 నెలల తర్వాత ఉంటుందని అన్నారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు బీఆర్ఎస్‌కి విక్రయించారని ఆయన ఆరోపించారు. అయితే ఈసారి రానున్న ఉపఎన్నికలో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు.. బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా? లేక కాంగ్రెస్ పార్టీకి విక్రయిస్తారా? అనేది చూడాలన్నారు.
బీజేపీ విషయానికి వస్తే.. గతంలో కుల రాజకీయం జరిగిందన్నారు రాజాసింగ్. ఈసారి కూడా కుల రాజకీయం జరుగుతుందా? లేక పార్టీలోని సీనియర్లకు అవకాశం ఇస్తారా? అనేది చూడాల్సి ఉందని ఎమ్మెల్యే రాజా సింగ్ అభిప్రాయపడ్డారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో సోమవారం మరణించారు. దీంతో కొన్ని నెలల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.
ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాజాసింగ్. ఆయనకు కళ్లు ఉన్నా చూడరు, నోరు ఉన్నా మాట్లాడరు అంటూ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. మొత్తంగా కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.