MP Bandi Sanjay: కేసీఆర్ నిమ్మకాయ ఇచ్చినా, బొట్టు పెట్టినా, కంకణం కట్టినా వద్దని చెప్పండి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

సీఎంకు కనీసం ఇంగీత జ్ఞానం లేదు. గ్రూప్-1 కూడా నిర్వహించలేని సర్కారు ఉండి ఎందుకు అంటూ సంజయ్ ప్రశ్నించారు. యువకుల భవిష్యత్తు నాశనమైతుంటే సీఎం ఎందుకు మాట్లాడటం లేదు. 30 లక్షల మంది యువత బతుకులు బజార్ల పడ్డాయి.

MP Bandi Sanjay: కేసీఆర్ నిమ్మకాయ ఇచ్చినా, బొట్టు పెట్టినా, కంకణం కట్టినా వద్దని చెప్పండి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

MP Bandi Sanjay

BJP Leader Bandi Sanjay: పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి (Pandit Deen Dayal Upadhyaya Jayanti)  సందర్భంగా కరీంనగర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ( MP Bandi Sanjay)  మొక్కలు నాటారు. అనంతరం బీజేపీ ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చేసేవన్నీ తాంత్రిక పూజలేనని అన్నారు. ఇప్పటి వరకు ఫామ్‌హౌస్‌లో, ప్రగతి భవన్‌ (Pragati Bhavan) లో చేసినవన్నీ తాంత్రిక పూజలే. ఇలాంటి పూజల్లో కేసీఆర్ ఆరితేరారని సంజయ్ విమర్శించారు. ఇతర పార్టీల్లోని నేతలను, తమ పార్టీలో చెబితే వినని నేతలను నాశనం చేసేందుకు పవర్‌ఫుల్ తాంత్రికులను తెచ్చి కేసీఆర్ పూజలు చేయిస్తున్నారని  సంజయ్ ఆరోపించారు.

తాంత్రిక పూజల్లో ఆరితేరిన కేసీఆర్ ..

కేసీఆర్ నిమ్మకాయ ఇచ్చినా, బొట్టు పెట్టినా, కంకణం కట్టినా కట్టుకోవద్దని బీఆర్ఎస్ పార్టీ నేతలకు బండి సంజయ్ సూచించారు. అట్రాక్ట్ చేసేందుకు కేసీఆర్ తాంత్రిక పూజలు మొదలు పెట్టారు. మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు, పెద్ద మనుషుల ఆరోగ్యం జాగ్రత్త. ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు. మీ కుటుంబాలు తాంత్రిక పూజల భారిన పడకుండా చూసుకోవాలి. సీఎం కేసీఆర్ వ్యక్తిత్వమే అలాంటిది.. ఇతరుల నాశనాలు ఆయన కోరుకుంటారు అంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మవారు ఇలాంటి వారిని క్షమించదు. తాంత్రిక పూజలు మాపై పనిచేయదని సంజయ్ అన్నారు.

 

కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు ఏటీఎం లాంటిది ..

సీఎం కేసీఆర్ సంపాదించిన కోట్లాది రూపాయలతో రాజకీయం చేయాలనుకుంటున్నాడు. కానీ, ఆయన పాచికలు పారవు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈసారి గెలిచేది లేదు. వాళ్లకు విధి విధానాలే లేవు. కాంగ్రెస్ ఎప్పుడుంటదో.. ఎప్పుడు బాంబులా పేలిపోతుందో తెలియదు. కాంగ్రెస్‌లో గెలిచినా డబ్బులకు అమ్ముడు పోతారని కేసీఆర్‌కు తెలుసు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు ఏటీఎం లాంటిది. కాంగ్రెస్‌లో కులాల కొట్లాట, బీఆర్ఎస్ డబ్బుల కొట్లాట ఉంది. కాంగ్రెస్‌లో కులాల కొట్లాట పెట్టించిందే కేసీఆర్. ఇటీవల నియోజకవర్గాల వారిగా ప్రకటించిన సీట్లలో సగం మందికి కేసీఆర్ టికెట్లు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా వారిని ఓడించి.. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారిని తీసుకుంటాడు. కాంగ్రెస్‌లో గెలిచే అవకాశం ఉన్నా, ఇండిపెండెంట్‌గా వారికి కేసీఆర్ డబ్బులిస్తున్నాడు అంటూ సంజయ్ ఆరోపించారు. మందికి పుట్టిన బిడ్డను తన బిడ్డ అనుకునే నీచపు బుద్ధి కేసీఆర్ ది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

గణపతి ఉత్సవాల పేరుతో డబ్బులు ..

ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా.. కేసీఆర్‌ను ఎప్పుడు ఓడిద్దామా అనే కసితో ప్రజలు ఉన్నారని సంజయ్ అన్నారు. ఆధారాలు దొరకకుండా దొంగతనాలు చేసినట్లుగా.. ఒక్కో ఎమ్మెల్యేకు మూడు కోట్లు వినాయక నవరాత్రుల పేరిట పంపించారు. వీటిని యువతకోసం ఖర్చు చేసి ఓట్లు లాగే ప్రయత్నం చేస్తున్నారంటూ సంజయ్ ఆరోపించారు. వినాయక మండపాల పేరుతో కేసీఆర్ కోట్లాది రూపాయలు పంచుతున్నారని అన్నారు. కరీంనగర్‌లో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలో చేరిన వారికి ఐదు లక్షలు, పది లక్షలు ఇస్తున్నారు. బీసీబంధు, దళితబంధు పేరిట యువకులను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు.

 

వారందరికీ లక్ష భృతి ఇవ్వాలి..

సీఎంకు కనీసం ఇంగీత జ్ఞానం లేదు. గ్రూప్-1 కూడా నిర్వహించలేని సర్కారు ఉండి ఎందుకు అంటూ సంజయ్ ప్రశ్నించారు. యువకుల భవిష్యత్తు నాశనమైతుంటే సీఎం ఎందుకు మాట్లాడటం లేదు. 30 లక్షల మంది యువత బతుకులు బజార్ల పడ్డాయి. కూలీనాలీ చేసి పిల్లలను చదివించుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోచింగుల పేరిట లక్షల రూపాయల ఖర్చు చేసిన యువతకు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీలేదు. ఇంటర్మీడియట్, టెన్త్, గ్రూప్-1 లాంటి అన్నిరకాల పరీక్షలు నిర్వహించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. విద్యావ్యవస్థను నాశనం చేశారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 విషయంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. గ్రూప్ -1 రాసిన వారందరికీ లక్ష రూపాయల భృతి ఇవ్వాలి. నీవు ఇస్తానన్న నిరుద్యోగ భృతి బకాయిలన్నీ చెల్లించిన తర్వాతనే యువతను ఓట్లు అడగాలని బండి సంజయ్ అన్నారు. ఓయూ, కేయూలో యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రశ్నించే నిరుద్యోగులపై కేసులు పెడుతున్నారంటూ సంజయ్ మండిపడ్డారు. దీన్ దయాల్ స్ఫూర్తితో పనిచేస్తాం. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు మోదీవైపు, బీజేపీ వైపు ఉన్నారని బండి సంజయ్ అన్నారు.