కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల పింఛన్‌లను రద్దు చేసింది: హరీశ్‌రావు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లు రద్దు చేశారని హరీశ్ రావు ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల పింఛన్‌లను రద్దు చేసింది: హరీశ్‌రావు

Harish Rao

Updated On : August 7, 2025 / 1:40 PM IST

Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు లక్షల పింఛన్లను రద్దు చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. అసంపూర్తి రుణమాఫీ, ధాన్యం బోనస్ చెల్లింపులో జాప్యం, రైతు భరోసాలో కోత విధించడంపై గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో రైతు మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రులు హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు.. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లు రద్దు చేశారని హరీశ్ రావు ఆరోపించారు. రెండేళ్ల పాలనలో ఏం సాధించారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కేవలం బిల్లులకు కమీషన్లు.. ప్రతిపక్షాలపై విమర్శలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని హరీశ్ రావు అన్నారు.

అధికారంలోకి వచ్చాక తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ ఆ హామీని మొదలు పెట్టలేదు. 4000 పింఛన్ ఇస్తామని చెప్పిన హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురుదక్షిణ కింద గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నేపల్లి పంపులను ఇప్పుడు ఆన్ చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నింటిలో నీరు వచ్చి చేరుతుంది. గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని హరీశ్ రావు అన్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో బిల్లులు రాలేదని ధర్నా చేస్తే వారిపై కేసులు పెట్టడం దారుణం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి కోడిగుడ్డుకు కూడా టెండర్లను పిలిచి ఇప్పటికీ గుత్తేదార్లను ఎంపిక చేయడం లేదని.. ఇలా అన్ని పనుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని, ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు అన్నారు.