BRS: ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్‎‎ దృష్టి.. పరిశీలనలో వీరి పేర్లు..

ఈ ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని నేతలకు అవకాశం కల్పించాలన్న యోచనలో గులాబీ బాస్‌ ఉన్నట్లు..

BRS: ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్‎‎ దృష్టి.. పరిశీలనలో వీరి పేర్లు..

BRS

పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల కావడం బీఆర్ఎస్‌లో జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఖాళీ అయిన ఒక స్థానిక సంస్థల మండలి స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. త్వరలో జరగబోయే ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో అభ్యర్థి ఎవరన్నది ఆసక్తి రేపుతోంది.

రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పాలమూరు జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలో రెండు శాసనమండలి స్థానాలను బీఆర్ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకుంది. కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆ స్థానానికి మార్చి నెలలో ఉప ఎన్నిక జరగనుంది.

లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై గులాబీ పార్టీ దృష్టి సారించింది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు రావడంతో ఆస్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. అధికార పార్టీ అభ్యర్థి పేరు దాదాపు ఖరారు కావడంతో ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది.

స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మెజారిటీ సంఖ్యలో ఉన్నప్పటికీ…. పోటీ చేసేందుకు మాత్రం గులాబీ నేతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు లోక్‌సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోయినా…. పార్టీ అవకాశం ఇస్తే మండలి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామన్న సంకేతాలను ఇస్తున్నారు.

రాజకీయ సమీకరణలతో బీఆర్ఎస్‌ గతంలో రెండు స్థానాలను నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలోని నేతలకే కట్టబెట్టింది. ఈ ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని నేతలకు అవకాశం కల్పించాలన్న యోచనలో గులాబీ బాస్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

వెంకటేశ్వర్ రెడ్డికి ప్రాధాన్యం?
సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి ఈ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డికి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను పరిశీలిస్తే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లేదా రవికుమార్ పేర్లను అధిష్ఠానం పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల్లో గులాబీ పార్టీ ప్రజా ప్రతినిధులే మెజారిటీ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తే ఈ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Telangana BJP Politics : ఈటల రాజేందర్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్.. తెలంగాణ బీజేపీలో కలకలం..!