Telangana Congress: వ్యూహాల‌కు ప‌దునుపెడుతోన్న కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి వల!

ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన కీల‌క నేత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఒకరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవ‌డానికి రెడీ అయినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్సీ కాంగ్రెస్‌లో చేరే విషయంలో కొందరు కుల సంఘాల నాయకులు జోక్యం చేసుకోవడం ఆస‌క్తిక‌రంగా మారింది.

Telangana Congress: వ్యూహాల‌కు ప‌దునుపెడుతోన్న కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి వల!

BRS MLC Kasireddy Narayan Reddy likely to join Congress

Telangana Congress – BRS MLC: ఎన్నిక‌లు ద‌గ్గర‌ప‌డుతున్న కొద్ది కాంగ్రెస్ పార్టీ వ్యూహాల‌కు ప‌దునుపెడుతోంది. గెలుపు గుర్రాలు ఎక్కడున్నా.. పార్టీలోకి లాగే ప్రయ‌త్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ఇత‌ర పార్టీలో అసంతృప్త నేత‌ల‌ను పెద్ద సంఖ్యలో చేర్చుకున్న కాంగ్రెస్.. మ‌రికొంత మందిపైనా వలవేస్తోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీలో కీల‌క‌ నేత‌లను హ‌స్తం గూటికి చేర్చుకునే ప్రయత్నంతో రకరకాల వ్యూహాలను అమలుచేస్తోంది కాంగ్రెస్.. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన చాలా మంది నేతలపై ఫోకస్ పెట్టిన హస్తంపార్టీ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఒకరి కోసం ఏకంగా కుల సంఘాల నేతలను రంగంలోకి దింపిందట. అసలు కులసంఘాలకు కాంగ్రెస్‌కు సంబంధం ఏంటి? తెరవెనుక రాజకీయమేంటో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ కాంగ్రెస్ లోకి వ‌ల‌స‌ల జోరు కొన‌సాగుతోంది. అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ మంది నేతలు ఎంచుకోవడంతో ఒక్కొక్కరు హస్తం గూటికి చేరుతున్నారు. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి చాలా మంది కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా మ‌రికొంత మందిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఇలా ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన కీల‌క నేత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఒకరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవ‌డానికి రెడీ అయినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్సీ కాంగ్రెస్‌లో చేరే విషయంలో కొందరు కుల సంఘాల నాయకులు జోక్యం చేసుకోవడం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. (Revanth Reddy) పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చేరడంతో ఉమ్మడి పాల‌మూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి హైప్ వ‌చ్చిందని చెబుతున్నారు. జూప‌ల్లితోపాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్‌రెడ్డి కుమారుడు రాజేశ్‌రెడ్డి, వ‌న‌ప‌ర్తికి చెందిన మేఘారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (Yennam Srinivas Reddy) కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డికి (Kasireddy Narayan Reddy) గాలం వేసింది కాంగ్రెస్. బీఆర్‌ఎస్‌లో క‌ల్వకుర్తి టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ క‌సిరెడ్డి.. టికెట్ ఇస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: రేవంత్‌రెడ్డికి బ‌లం పెరిగిందా.. స్క్రీనింగ్ కమిటీలో చోటు చేసుకున్న ప‌రిణామాలేంటి?

ఐతే ఎమ్మెల్సీ క‌సిరెడ్డి కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవ్వడానికి పెద్ద మంత్రాగ‌మే న‌డిచిందంటున్నారు పరిశీలకులు. క‌ల్వకుర్తి ప్రాంతానికి చెందిన కొందరు కుల పెద్దలు రంగంలోకి దిగి కసిరెడ్డిని కాంగ్రెస్ దరికి చేర్చే బాధ్యత తీసుకున్నారట.. దివంగ‌త నేత జైపాల్‌రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, క‌ల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి అంతా ద‌గ్గరి బంధువులు. వీరంద‌రికి సంబంధించిన కుటుంబ పెద్దలు రంగంలోకి దిగి క‌సిరెడ్డికి మ‌ద్దతుగా నిలిచార‌ట‌. క‌ల్వకుర్తి నుంచి ఈ సారి వంశీచంద్‌రెడ్డి పోటీ చేయ‌కుండా.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్లమెంట్ బ‌రిలో నిల‌వాల‌ని భావిస్తున్నార‌ట‌. దీంతో క‌ల్వకుర్తి టికెట్‌ క‌సిరెడ్డికి ఇవ్వాల‌ని కుటుంబ పెద్దలు ప్రతిపాదించారని సమాచారం. దీనికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా అభ్యంత‌రం చెప్పకపోవడం.. కుటుంబ పెద్దల ఒత్తిడితో వంశీ కూడా ఓకే అనడంతో క‌సిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

Also Read: ఆపరేషన్ మల్కాజిగిరి.. మైనంపల్లికి చెక్ చెప్పేలా దీటైన నేత కోసం బీఆర్‌ఎస్ అన్వేషణ

మొత్తానికి కుటుంబం తరఫున కుల పెద్దలు రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక ఎమ్మెల్సీ కసిరెడ్డి కాంగ్రెస్‌లో చేరడమే మిగిలివుందని అంటున్నారు పరిశీలకులు. ఒకటి రెండు రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుందని చెబుతున్నారు.