ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. కవితను నిందితురాలిగా చేర్చి సీబీఐ నోటీసులు..

సీబీఐ విచారణకు హాజరు కావద్దని కవిత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 28న ఈడీ కేసులో సుప్రీంకోర్టులో విచారణ..

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. కవితను నిందితురాలిగా చేర్చి సీబీఐ నోటీసులు..

MLC Kavitha

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. గతంలో కవితను ఈడీ, సీబీఐ సాక్షిగానే విచారించిన విషయం తెలిసిందే. మాగుంట రాఘవ, కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలాల ఆధారంగా రాబోయే రోజుల్లో కవితపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నిందితురాలిగా కవితను ప్రశ్నించేందుకు 41ఏ కింద ఆమెకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. 26న ఢిల్లీలో వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని నోటీసులో కవితకు చెప్పారు సీబీఐ అధికారులు. అప్రూవర్ గా మారి సీబీఐకి రాఘవ కీలక సమాచారం ఇవ్వడంతో.. ఆ వాంగ్మూలం ఆధారంగానే కవితను నిందితురాలుగా చేర్చినట్లు తెలుస్తోంది.

రాఘవ అప్రూవర్ గా మారి దర్యాప్తు అధికారులకు ఏమి చెప్పారన్న ఉత్కంఠ నెలకొంది. గతంలో ఈడీ కేసులోనూ అప్రూవర్ గా మారి నగదు లావాదేవీలపై సమాచారం ఇచ్చారు రాఘవ. ఇప్పుడు సీబీఐ కేసులోనూ అప్రూవర్ గా మారారు. గతంలో 161 కింద సాక్షిగా కవితను విచారించింది సీబీఐ.

అప్పట్లో 161 కింద నోటీసులు ఇచ్చాం కాబట్టి హైదరాబాద్ వెళ్లి ఆమెను విచారించామని, ఇప్పుడు నిందితురాలిగా చేర్చి నోటీసులు ఇచ్చినందున స్వయంగా ఆమె విచారణ హాజరుకావాల్సిందేనని సీబీఐ వర్గాలు అంటున్నాయి. మరోవైపు, అశోక్ కౌశిక్ కూడా అప్రూవర్ గా మారి మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.

కవిత ఎంపీగా పనిచేసిన సమయంలో ఆమె సెక్రటరీగా తాను పనిచేశానని, ఆమె ఓడిపోయిన తర్వాత తన జీతం బకాయి ఉండటంతో హైదరాబాద్ వెళ్లానని అశోక్ కౌశిక్ చెప్పారు. తాజా పరిణామాలపై న్యాయ నిపుణులతో కవిత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

విచారణకు దూరంగా కవిత?
సీబీఐ విచారణకు హాజరు కావద్దని కవిత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 28న ఈడీ కేసులో సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఆమె సీబీఐ విచారణకు గైర్హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కాగా, లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఇటీవల ఈ నెల 28కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Read Also: లాస్య నందిత పోస్ట్‌మార్టం నివేదిక.. తలకు బలమైన గాయంతో పాటు..