Warangal Mamnoor Airport : వరంగల్ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్
ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది.

Warangal Mamnoor Airport : వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తితో మామునూరు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు 205 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది.
ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది. మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది.
Also Read : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రోరైలు దిగి స్కైవాక్ ద్వారా మీ ఇంటికెళ్లొచ్చు..
ఈ 253 ఎకరాల్లో కొంత రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేవిగేషన్ ఇన్ స్ట్రుమెంట్ ఇన్ స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత్ విమానాలు నడిచేవి. భారత్, చైనా యుద్ధ సమయంలో కీలక సేవలు అందించాయి. దాదాపు 32 ఏళ్ల క్రితం మూతపడిన మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాగా.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి 150 కిలోమీటర్ల దూరంలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి అనుమతి లేదన్న నిబంధన ఉంది. అయితే.. నవంబర్ 2024లో.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ జారీ చేసిందని తెలంగాణ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని (ఏఏఐ) సంప్రదించింది.
వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి 253 ఎకరాలను ఏఏఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం, వరంగల్ విమానాశ్రయం నాన్-ఆపరేషనల్ AAI విమానాశ్రయం.
Also Read : ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై డౌట్స్ ఉన్నాయా..? మీకో అప్డేట్..
మామునూర్ విమానాశ్రయంలో కార్యకలాపాలు దాదాపు మూడు దశాబ్దాల క్రితం మూసివేయబడ్డాయి. అప్పటి నుండి కేవలం ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ మాత్రమే విమానాశ్రయంలో సౌకర్యాలను ఉపయోగించుకుంది. కాగా, మామునూర్ ఎయిర్‌పోర్టుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.