Chandrayangutta Constituency: చాంద్రాయణగుట్టలో మజ్లిస్ గెలుపును ఆపలేకపోవడానికి కారణమేంటి?
చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ తనకు తాను తప్పుకుంటే తప్పా మరో అభ్యర్థి గెలిచే అవకాశం లేనట్లు మారింది పరిస్థితి. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ఎంబీటీ మళ్లీ ఎంఐఎంను ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదు.

Chandrayangutta Assembly Constituency Ground Report
Chandrayangutta Assembly Constituency: హైదరాబాద్ పాతబస్తీ (Hyderabad Old City) రాజకీయాల్లో సంచలనాల కేంద్రం చాంద్రాయణగుట్ట. మైనార్టీ ఓట్లకు హక్కుదారుగా పాతుకుపోయిన మజ్లిస్ పార్టీకి వెన్నులో వణుకుపుట్టించేలా.. మరో మైనార్టీ పార్టీకి ప్రాణం పోసింది చాంద్రాయణగట్ట నియోజకవర్గమే.. పాతబస్తీలో ఏకపక్ష రాజకీయాలు చెల్లవని ఎంఐఎంకు వార్నింగ్ ఇచ్చిన చాంద్రాయణగుట్ట.. మజ్లిస్ కంచుకోటగా ఎలా మారింది. హిందువుల ఓట్లు గణనీయంగా ఉన్నా.. మరే పార్టీ మజ్లిస్ గెలుపును ఆపలేకపోవడానికి కారణమేంటి? ఈ సారి చాంద్రాయణగుట్టలో కనిపించబోయే సీనేంటి?
చంద్రాయణ్ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పాతబస్తీలో ఓ రాజకీయ సంచలనం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ పాలిటిక్స్‌లో ఎంఐఎంకి ముచ్చెమటలు పట్టించిన చరిత్ర ఈ నియోజకవర్గానిది. ఎంఐఎం చీఫ్ సలావుద్దీన్ ఒవైసీతో ఢీ అంటే ఢీ అనేలా రాజకీయాన్ని మార్చింది. సలార్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ముస్లింల్లో తిరుగుబాటు తెచ్చిన ఎంబీటీ పార్టీని గెలిపించింది ఈ నియోజకవర్గమే.. ఈ నియోజకవర్గంలో 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎక్బోటే గోపాల్ రావు గెలిచారు. ఐతే 1978 నుంచి చాంద్రాయణగుట్ట మజ్లిస్ కంచుకోటగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీచేసిన అమానుల్లాఖాన్ గెలవడంతో మజ్లిస్
జైత్రయాత్ర మొదలైంది. ఆ తర్వాత వరుసగా, 1983, 1985, 1989లలో అమానుల్లాఖాన్ గెలిచారు.

Akbaruddin Owaisi
ఎంఐఎంలో ఎన్నో పదవులు అధిష్టించిన అమానుల్లాఖాన్.. ఆ తర్వాత పార్టీపై తిరుగుబాటు చేశారు. MIMలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ.. 1993లో మజ్లీస్ బచావో తెహరిక్ (ఎంబిటీ) పార్టీని స్థాపించారు. అలా పాతబస్తీలో ఓవైసీకి వ్యతిరేకంగా బలమైన రాజకీయం నడిపి, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించారు. పాతబస్తీలో ఒవైసీ రాజకీయానికి బ్రేక్ వేసిన అమానుల్లాఖాన్.. ఎంఐఎంను చార్మినార్ అసెంబ్లీ సీటుకే పరిమితం చేశారు. ఆ తర్వాత సలావుద్దీన్ వ్యూహాంతో ఒవైసీ చిన్న కుమారుడు అక్బరుద్దీన్ 1999 ఎన్నికల్లో అరగేట్రం చేసి ఖాన్ ఓడించారు. ఇక నాటి నుంచి.. ఇప్పటివరకు వరుసగా ఐదోసారి గెలిచి ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పీఏసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు అక్బరుద్దీన్.
పూర్తిగా పాతబస్తీలో అంతర్భాగంగా ఉన్న చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 8 డివిజన్లు ఉన్నాయి. చాంద్రాయణగుట్ట, బార్కాస్, బండ్లగూడ, మొయిన్ బాగ్ జంగమ్మెట్, రక్షాపురం, ఈడి బజార్, ఉప్పుగూడ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 2 లక్షల 63 వేల 278 మంది ఓటర్లు ఉండగా, హిందూ ఓటు బ్యాంకు కూడా బాగానే ఉంది. ముఖ్యంగా చంద్రాయణగుట్ట, జంగమ్మెట్, రక్షా పురం, ఉప్పుగూడల్లో హిందూ ఓట్లు ఎక్కువ. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులుగా హిందువులను రంగంలోకి దింపడంతో ఓట్లు చీలిపోయి ఎంఐఎం ఈజీగా గెలుస్తోంది.
Also Read: మంథనిలో కాంగ్రెస్ ధీమా.. మరో చాన్స్ ఇవ్వమంటున్న మధు.. బీజేపీ పరిస్థితి ఏంటి?
ఎంఐఎం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్బరుద్దీన్ ఒవైసీ తిరుగులేని నేతగా పట్టుసాధించారు. తనదైన రాజకీయ చతురతతోపాటు మైనార్టీ, హిందు ఓటర్లనే తేడా లేకుండా అందరికీ దగ్గరయ్యారు. గత ఎన్నికల ముందు ప్రత్యర్థి వర్గం చేసిన దాడిలో త్రుటిలో తప్పించకున్న అక్బరుద్దీన్.. నిత్యం ప్రజల్లో ఉంటూ సరక్షిత ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు. అక్బరుద్దీన్ తనకు తాను తప్పుకుంటే తప్పా ఇక్కడ మరో అభ్యర్థి గెలిచే అవకాశం లేనట్లు మారింది పరిస్థితి.

Shahezadi Syed
ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ పోటీ చేస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీతోపాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్తోనూ ఎంఐఎంకి లోపాయికారి సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఆ పార్టీలు అక్బరుద్దీన్‌పై బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించుతాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడి నుంచి గెలివాలి అన్న లక్ష్యంతో బీజేపీ షాహేజాది సయ్యద్ (Shahezadi Syed) అనే మైనార్టీ మహిళా మోర్చ నేతను రంగంలోకి దింపింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 15 వేలకు పైగా ఓట్లను వచ్చాయి. ఆ తర్వాత షాహేజాదికి బీజేపీ ఏకంగా జాతీయ మైనార్టీ మహిళా కమిషన్ మెంబర్ పదవి ఇచ్చింది. ఈసారి కూడా ఆమె చంద్రాయణ్ గుట్ట అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు.

Esa Bin Obaid Misri
ఇక వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ సీరియస్‌గా పోటీచేస్తుందా, లేదా? అన్న చర్చ సాగుతోంది. ఎంఐఎం ఇప్పుడు బీఆర్ఎస్తో దోస్తీకి కటీఫ్ చెప్పనుందనే ప్రచారంతో చాంద్రాయణగుట్ట రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎం. సీతారాం రెడ్డి (M Seetha Ram Reddy) కి 14 వేల 227 ఓట్లు వచ్చాయి. అధికారంలో ఉన్నప్పుడు తమ సహకారంతో రాజకీయంగా ఎదిగి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంపై రివేంజ్ తీసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈసారి ఇక్కడి నుంచి గట్టి అభ్యర్థిని పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఈసా మిస్త్రీ (Esa Bin Obaid Misri)కి 11 వేల 310 ఓట్లు వచ్చాయి. ఈ సారి బలమైన మైనార్టీ నేతను బరిలోకి దింపితే.. బాగుంటుదన్న యోచనలో ఉంది కాంగ్రెస్. ఇక గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ఎంబీటీ మళ్లీ ఎంఐఎంను ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదు.
Also Read: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ ఈసారి ఎవరికి.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు?
పాతబస్తీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఎంఐఎంను ఓడించడమంటే మిగిలిన పార్టీలకు అంత ఈజీ కాదనేది పరిశీలకుల అభిప్రాయం. మైనార్టీ ఓట్లపై పట్టులేకపోవడంతో ప్రధాన పార్టీలు కూడా ఇక్కడి నుంచి నామ్‌కే వాస్తే పోటీకే పరిమితం అవుతుండటంతో విజేత కోసం కాకుండా.. ద్వితీయ స్థానం కోసమే పోటీపడేలా కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.