తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ డిజైన్‌లో మార్పులు

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ డిజైన్‌లో మార్పులు

Updated On : December 20, 2020 / 8:57 AM IST

Telangana new secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. నిర్మాణ డిజైన్‌లో అంతర్గతంగా, వెలుపల పలు మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గతంలోనే తుది డిజైన్‌ను ఖరారు చేసినా సీఎం కేసీఆర్‌ పలు మార్పులను సూచించారు. ఇంతకి డిజైన్‌లో చేసిన మార్పులేంటి? కొత్త సచివాలయం ఎప్పటిలోగా పూర్తి కానుంది?

తెలంగాణ పాత సచివాలయాన్ని ప్రభుత్వం ఇప్పటికే కూల్చివేసింది. కొత్త సచివాలయాన్ని రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా అద్భుత రీతిలో నిర్మించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త సచివాలయం తుది డిజైన్‌పై కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.

పలుమార్లు సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులతో చర్చలు జరిపారు. కొన్ని మార్పులు సూచించి తుది మెరుగులు దిద్దారు. కొత్తగా ప్రభుత్వం ఆమోదించిన డిజైన్‌లో భవనం ముందు స్థలంలో హెలిప్యాడ్, రెండు వైపులా లాన్లు, వాహనాల పార్కింగ్‌ స్థలంలో చిన్న పాటి మార్పులు చేశారు.

కొద్ది నెలల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త సచివాలయ ఫైనల్ డిజైన్‌తో పాటు సచివాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. మరోవైపు సచివాలయం కూల్చివేత, నిర్మాణం విషయంలో హైకోర్టులో దాఖలైన కొన్ని కేసులు తొలగిపోయాయి. కొత్త భవన నిర్మాణానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

జూలై 7న కూల్చివేత పనులను ప్రారంభించి, కొద్ది రోజుల్లోనే పాత సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేలమట్టం చేసింది. శిథిలాల తరలింపు కూడా పూర్తయ్యింది. కొత్త సచివాలయ నిర్మాణానికి టెండర్లు కూడా ఫైనల్ అయ్యాయి. 500 కోట్ల రూపాయలతో కొత్త సచివాలయాన్ని నిర్మించబోతున్నారు.

వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి కొత్త సచివాలయం నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కోర్టులో కేసులు అన్ని తొలగిపోవడంతో భవన నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పనులు ప్రారంభమైన నేపథ్యంలో భవన నిర్మాణము, ఖాళీ స్థలంలో చిన్నపాటి మార్పులు చేస్తూ నిర్మాణ సంస్థకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.