Telangana : ‘రైస్ పుల్లింగ్’ చెంబు అంటూ మాయ చేశారు..రూ.లక్షలు దోచేశారు..
అద్భుత శక్తులు కలిగిన రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అమాయకులను మాయ చేసి మోసగిస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Cheating With Rice Pulling Bowls
Cheating with rice pulling bowls : ఎవ్వరికి లాజిక్కులు అక్కర్లేదు సార్..మ్యాజిక్ లే కావాలి..అని ఓసినిమాలో చెప్పినట్లుగా మాయ మాటల్నే నమ్ముతారు. దాంట్లో నిజం ఎంతుంది అని ఆలోచించని జనాలు ఉన్నంత కాలంలో కేటుగాళ్ల ఆగడాలు కొనసాగుతునే ఉంటాయి. అటువంటి కేటుగాళ్లు కొంతమంది ‘మాయలు చేసే మంత్రాల చెంబు మీ ఇంట్లో ఉంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది’అని చెప్పారు. దాంతో నమ్మేసిన జనాలు మోసపోయాం అని తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. రైస్ పుల్లింగ్ చెంబులు కొన్న జనాలు లబోదిబోమంటు పోలీసుల దగ్గరకు పరుగులెత్తారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో రైస్ పుల్లింగ్ చెంబుల మాయటపడ్డారు జనాలు. పోలీసులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు చెంబుల మాయగాళ్లలో కొంతమందిని పట్టుకుని అరెస్ట్ చేశారు.
అద్భుత శక్తులు కలిగిన రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అమాయకులను మాయ చేసి మోసగిస్తున్న ఏడుగురితో కూడిన ముఠాలో ఐదుగురు సభ్యులను నల్గొండ డీఎస్పీ నర్సింహారెడ్డి అరెస్టు చేసారు.నల్గొండ టూటౌన్ సీఎస్ లో డీఎస్సీ నర్శింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాయ చెంబుల వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి మూడు పుల్లింగ్ చెంబులతో పాటు ఒక కారు, 5 సెల్ ఫోన్లు, 9 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Also read : Zheng Qinwen: నేను అబ్బాయినైతే బాగుండు.. నెలసరి నొప్పి ఆమె ఆశలను ఆవిరిచేసింది
ఈ కేటుగాళ్ల మోసాల్లోకి వెళితే..హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన పరుశురాం అనే వ్యక్తి మాయమాటలతో అద్భుత శక్తులు కలిగిన రైస్ పుల్లింగ్ చెంబులు అంటూ అమాయకులను నమ్మించి వారికి అమ్మి సులభంగా డబ్బు గడించేందుకు పక్కా ప్లాన్ వేశాడు. అదే విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. వారు పరుశురాంతో చేరారు. పరుశురాం తన అనుచరులతో కలిసి కొంతకాలంగా కల్వకుర్తి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, దేవరకొండ ప్రాంతాల్లో రైసుపుల్లింగ్ చెంబులు విక్రయిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన అతని స్నేహితుడు ఆరోజు 41 ఏళ్ల లక్ష్మీనారాయణ కూడా పరశురాం వద్ద ఈ మాయల గురించి తెలుసుకున్నాడు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన తన స్నేహితులు కొండారపు నాగరాజు(42), శ్యాంపురం మురళీమనోహర్(44), వర్తియా లక్ష్మణ్‌నాయక్(40), సందుల రవి(32), శర్మలతో కలిసి ముఠాగా ఏర్పడి చెంబుల మోసాలకు దిగారు. ముఖ్యంగా వైన్ షాపుల వద్ద అతిగా మద్యం తాగి కనిపించిన వారిని గుర్తించి వారికి రూ.500 ఇచ్చి వారి గుర్తింపు కార్డుల ద్వారా సిమ్‌కార్డులు కొనేలా చేయిస్తారు. వాటి ద్వారా అమాయకులకు ఫోన్ చేసి చెంబుల అమ్మకానికి బేరం కుదుర్చుకుంటున్నారు.
Also read : Drugs : గోవా నుంచి డ్రగ్స్ తెస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్
నల్గొండలోని వీటీ కాలనీకి చెందిన శంకరకొండ శ్రీనివాస్‌కు ముఠా సభ్యుడు లక్ష్మణ్ ఫోన్ చేసి రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉన్నవారికి పిడుగు పడినా నష్టం జరగదని, ఇది తిరిగి అమ్ముకున్నా రూ.కోట్లు వస్తాయని నమ్మించాడు. కొద్ది రోజుల తరువాత మరో సభ్యుడు శ్రీనివాస్‌కు ఫోన్ చేసి మీ వద్ద రైస్ పుల్లింగ్ చెంబు ఉందా అని, దాన్ని తాను కొంటానంటూ నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన శ్రీనివాస్ తనకు ఫోన్ చేసిన వ్యక్తిని సంప్రదించి రూ.4.60 లక్షలు చెల్లించి చెంబు కొన్నాడు. తిరిగి అమ్మడానికి తనకు ఫోన్ చేసిన వ్యక్తిని సంప్రదించడానికి యత్నించగా స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
నల్గొండ పానగల్ బైపాస్ వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇన్నోవా కారులో లక్ష్మీనారాయణ, నాగరాజు, మురళీమనోహర్, లక్ష్మణ్, రవి అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవటంతో గుట్టు అంతా బయటపడింది. అలా ఆ ఐదుగురిని రిమాండ్‌కు పంపారు పోలీసులు. ముఠాలోని పరశురాం, శర్మ పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, సైదులు, మురళీకృష్ణ పాల్గొన్నారు.