ఏడాది తర్వాత మోడీతో కేసీఆర్ భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే?

  • Published By: bheemraj ,Published On : December 12, 2020 / 08:45 PM IST
ఏడాది తర్వాత మోడీతో కేసీఆర్ భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే?

Updated On : December 12, 2020 / 9:00 PM IST

CM KCR met Prime Minister Modi : ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఏడాది తర్వాత ప్రధానితో భేటీ అయిన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించారు.. కోవిడ్‌, రాష్ట్ర పథకాలు, ప్రాజెక్టులకు కేంద్రం నిధులు సహా..అభివృద్ధి అంశాలపై మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది.

అకాల వర్షాల వల్ల పంటనష్టపోయిన తెలంగాణకు విపత్తు నిధులను మంజూరు చేయాలని మోదీకి సీఎం కేసీఆర్‌ విన్నవించారు.. రాష్ట్రానికి పెండింగ్‌ రైల్వే ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని, బయ్యారం స్టీల్ ప్లాంట్‌, జహీరాబాద్‌లో నిమ్జ్‌ ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్‌.. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరితో భేటీ అయ్యారు.. తెలంగాణ రాష్ట్రంలో గృహనిర్మాణాల పురోగతి, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.

20 నిమిషాల పాటు ఇరువురు నేతల భేటీ కొనసాగింది.. ఈ సందర్భంగా ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు..

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వరద సాయం రాబట్టడమే ఎజెండాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాగుతోంది. తొలిరోజు పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయిన కేసీఆర్… కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతోనూ సమావేశమయ్యారు.