Telangana : బీజేపీ ట్రాప్ లో పడొద్దు..ఢిల్లీ వేదికగా రైతుల సమస్యలపై ఉద్యమం చేద్దాం..కేంద్రం మెడలు వంచుదాం : కేసీఆర్
‘తెలంగాణ రైతుల సమస్యలపై ఢిల్లీ వేదికగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదాం’ అంటూ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Cm Kcr Calls For Telangana Farmer Protest
CM KCR calls for Telangana farmer protest : ‘తెలంగాణ రైతుల సమస్యలపై ఢిల్లీ వేదికగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదాం’ అంటూ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక విషయాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పంజాబ్ తరహాలో తెలంగాణ నుంచి కూడా కేంద్రం రెండు పంటలు కొనేలా ఉద్యమిద్దామని చెప్పారు.
రైతుల సమస్యలు, ఎస్టీ రిజర్వేషన్లు, చేనేత కార్మికుల సమస్యలు,తెలంగాణ విభజన సమస్యలు వంటి పలు అంశాలపై ఉద్యమం చేపట్టాలని ఆ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమం అంత తీవ్రంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణకు చేస్తున్న అంశాలను కేసీఆర్ నేతలకు వివరించారు. కేంద్రం అసలు విషయాలను పక్కనపెట్టి కశ్మీర్ ఫైల్స్ ని ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే దుర్మార్గం జరుగుతోందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
కేంద్రం ఏ వర్గాన్ని సంతృప్తి పరచటం లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. 28వ తేదీన యాదాద్రికి పార్టీ శ్రేణులంతా తరలిరావాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా షబ్ కమిటీ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. దేశంలో అసలు సమస్యలే లేవని బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ చేపట్టే ఈ రైతు ఉద్యమంలో రైతులను కూడా భాగస్వామ్యులను చేయాలని నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజరయ్యారు.