రూ.5వేల కోట్ల అప్పులు.. RTC పనైపోయింది: సీఎం కేసీఆర్

రూ.5వేల కోట్ల అప్పులు.. RTC పనైపోయింది: సీఎం కేసీఆర్

Updated On : October 24, 2019 / 11:38 AM IST

వారాల తరబడి సమ్మెకు దిగిన ఆర్టీసీ వ్యవస్థ గురించి సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సమ్మె పూర్తిగా అర్థరహితంగా ఉంది. పనికిమాలిన డిమాండ్లతో కార్మికులను ముంచుతున్నారు. యూనియన్ స్వార్థ్యాల కోసం ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెడుతున్నారని తెలిపారు. 

ఈ సందర్భంగా సుదీర్ఘంగా ప్రసంగించిన సీఎం ఇలా స్పందించారు. ‘రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థ మీద నాకే అవగాహన ఉంది. గతంలో మూడు సంవత్సరాలు రవాణా శాఖ మంత్రిగా పనిచేశాను. 1997-98సంవత్సరంలో 13కోట్ల 80లక్షల రూపాయలు అప్పుల్లో ఉన్న ఆర్టీసిని సరిదిద్దాను. పక్షిలా తిరిగి బస్టాండ్‌లో టాయిలెట్లు నుంచి బస్సుల వరకూ జాగ్రత్త వహించి ఒకటిన్నర సంవత్సర కాలంలోనే 14కోట్లు లాభం వచ్చేలా చేశా.

మేం అధికారంలోకి వచ్చాక తెలంగాణ సెక్రటేరియట్ లో మీటింగ్ అయ్యేందుకు స్థలం లేకుండాపోయింది. వారితో సమావేశమయ్యేందుకు వైస్రాయ్ హోటల్లో ఆర్టీసీ, ఆర్ఎం, డీవీఎం, సంబంధిత అధికారులతో ఒకరోజు మొత్తం కేటాయించి చర్చించి సలహాలు ఇచ్చా. 44శాతం జీతాలు పెంచి పనిచేసుకొమ్మని చెప్పాం. ఆ తర్వాత మళ్లీ అడిగితే 14శాతం ఐఆర్ ఇచ్చాం. భారతదేశ చరిత్రలో 67శాతం జీతాలు పెంచింది మా ప్రభుత్వమే. 

జీతాలు పెంచినప్పటికీ గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ప్రభుత్వంలో కలపడం అంత సులువైన పనికాదు. ప్రభుత్వంలో విలీనం చేసుకుంటూ పోతే మొత్తం 57కార్పొరేషన్లను కలపాల్సి ఉంటుంది. వారికి వివరించాల్సింది పోయి ప్రతిపక్షాలు అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయి. అర్థరహితమైన డిమాండ్లు, స్వార్థపూరిత రాజకీయాలతో సమ్మెకు దిగుతున్నారు. 

యూనియన్ల కారణంగానే కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులు లేవు. బెంగాల్లో 200ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉన్నాయి. బీహార్లో అద్దె ఆర్టీసీలు నడుస్తున్నాయి. దిక్కుమాలిన సమ్మెలు చేస్తున్నారు. యూనియన్ ఎన్నికల కోసం సమ్మెలను ప్రోత్సహిస్తున్నారు. రూ.1200కోట్ల నష్టాల్లో ఆర్టీసీ నడుస్తుంది. ప్రభుత్వం పీఎఫ్ సొమ్మును తీసుకోలేదు. ఆర్టీసీకి ఇచ్చే దమ్ములేదు. ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం లాభాల్లో ఉంటే, ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది. ఆర్టీసీకి రూ.5వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న సీఎం కేసీఆర్..ఆర్టీసీని ఇక ఎవరూ కాపాడలేరని, ఆర్టీసీ పనైపోయిందని బాంబు పేల్చారు. 

అద్దెకు తీసుకుని నడిపిస్తున్న బస్సు కి.మీలకు 75పైసలు లాభం వస్తుంది. ఆర్టీసీ సొంత బస్సును నడిపితే రూ.13నష్టం వస్తోంది. అంటే రోజుకు 4లక్షల 70వేలు లాభం వస్తుంది. 3కోట్లు ఆర్టీసీ బస్సు మీద నష్టం వస్తుంది. 

అర్థరహితమైన డిమాండ్లు చేస్తూ ఆర్టీసీని ముంచుతున్నారు. టీఆర్ఎస్ కంటే ముందున్న ప్రభుత్వం రూ.700కోట్లు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం 4వేల 250కోట్లు 597శాతం పెంచాం. అదేగాక జీహెచ్ఎంసీ నుంచి అదనంగా ఇచ్చి మొత్తం నాలుగు వందల యాబై కోట్ల రూపాయలిచ్చాం. ఇంకా 2600 బస్సులు మార్చాల్సి ఉంది. వాటికి అదనంగా రూ.800కోట్లు నుంచి రూ.1000కోట్లు కావాలి.

పండుగ సీజన్లో ఎక్కువగా వచ్చే డబ్బులు మొత్తం పోయాయి. అదనంగా వచ్చే అవకాశం వృథా చేశారు. పనికిమాలిన డిమాండ్లతో సమ్మె చేశారు. కమిటీ వేసి బుజ్జగించే ప్రయత్నం చేశాం. వాటన్నిటినీ తోసిపుచ్చి సమ్మకు దిగారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన మోటారు వాహనాల చట్టం సెక్షన్ 57 ప్రకారం.. ఆర్టీసీని నియంత్రించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.