Cm Revanth Reddy : దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రండి- కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
కేసీఆర్ కుటుంబం ఏం చేసి లక్ష కోట్లు సంపాదించిందో ప్రజలకు చెప్పాలి..

Cm Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని కేసీఆర్ ను చాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
”హరీశ్ రావు నాకు సవాళ్లు విసురుతున్నారు.. నేను కూడా రెడీ… పిల్ల కాకులతో నాకెందుకు? దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి. ప్రాజెక్టులపై చర్చిద్దాం. బావా బామ్మర్దులకు ఏం తెలుసు? కేసీఆర్ తెలంగాణకు అప్పజెప్పిన దరిద్రం కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం… కుంగిన బ్యారేజ్ తొలగించాలన్నా వేల కోట్లు కావాలి.. కేసీఆర్ కుటుంబం ఏం చేసి లక్ష కోట్లు సంపాదించిందో ప్రజలకు చెప్పాలి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులు కట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, లక్ష కోట్లతో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిపోయిందని రేవంత్ అన్నారు. ప్రాజెక్టులపై చర్చకు కేసీఆర్, హరీశ్ రావు వస్తే.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చూపిస్తా అని అన్నారు. ఏ టైమ్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా చర్చకు నేను రెడీ అని రేవంత్ చెప్పారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎక్కడ కట్టారని హరీశ్ రావు ప్రశ్నిస్తున్నారు.. కేసీఆర్ చర్చకు వస్తే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులను చూపిస్తాం అని రేవంత్ వ్యాఖ్యానించారు.
Also Read : కాంగ్రెస్ సస్పెన్షన్ అస్త్రం మిస్ ఫైర్ అయ్యిందా? టార్గెట్ ఓ ఎమ్మెల్యే అయితే.. వేటు మరొకరిపై పడిందా?
జనగామ స్టేషన్ ఘనపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.800 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాారు. కడియం కావ్యను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఎయిర్ పోర్టును తెస్తానని చెప్పా, అన్నట్లుగా ఎయిర్ పోర్టును తీసుకొచ్చి మీ ముందు నిలబడ్డా అని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ తో పోటీపడే విధంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ లోకి రావాలని కడియం శ్రీహరిని నేనే అడిగాను అని రేవంత్ తెలిపారు. స్టేషన్ ఘనపూర్ ను అభివృద్ధి చేసే బాధ్యత మాది అన్నారు.
”దివిసీమ తుపానులో కొట్టుకుపోయిన వాళ్ళకంటే ఎక్కువ కేసీఆర్ కుటుంబం దివాళా తీసినట్లు ప్రవర్తిస్తున్నారు. కేసీఆర్ అట జాతిపిత అట..! పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఉంది. తెలంగాణను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారు? తాటి చెట్టు లెక్క పెరిగిన హరీశ్ రావు చెప్పాలి. మేము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో లక్ష 53 వేల కోట్లు ఇప్పటివరకు మిత్తి కట్టాము. పాపాల భైరవుడు రాష్ట్రాన్ని దోచేసి ఫాంహౌస్ లో పడుకున్నారు.
ఓట్లు అడగడానికి, ఓట్లు వేయడానికి ఈ మీటింగ్ కాదు. స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి కోసం జరుగుతున్న మీటింగ్ ఇది. చైతన్యం కలిగిన ప్రాంతం వరంగల్. ప్రజా సమస్యల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రాంతం వరంగల్. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబంలో చేతిలో పెడితే.. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. విద్యుత్ శాఖకు, సింగరేణికి బకాయిలు పెట్టారు. అసలు మిత్తి లక్ష 53 వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నాము.
పైరవీలు, సొంత పనులు అడగని వ్యక్తి కడియం శ్రీహరి. శ్రీహరి అంటేనే నాకు అభిమానం. నేను రమ్మంటేనే కాంగ్రెస్ లోకి కడియం వచ్చారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం. కాళేశ్వరం కాదది..కూళేశ్వరం.. తాటి చెట్టంత పెరగడం కాదు హరీశ్ రావు.. నీకు ఆవగింజంత తెలివి లేదు. పిల్ల కాకులతో నాకేం పని. కేసీఆర్ నువ్వు రా. ముఖం చెల్లకే అసెంబ్లీకి రాకుండా హరీశ్, కేటీఆర్ లను ఉసిగొల్పుతున్నారు కేసీఆర్.
Also Read : యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు.. సజ్జనార్ ఫైర్
ప్రతి నెల జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పండుకుంటే ఎట్లా? 15 నెలల్లో 58 లక్షల జీతం తీసుకొని అసెంబ్లీకి రాకుంటే ఎలా కేసీఆర్? ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీకి రాకపోతే అడగమా? నీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యం ఏంటో.. నిరుద్యోగ యువతకు చెప్పు కేసీఆర్. కేసీఆర్ తన అనుభవాన్ని, విజ్ఞానాన్ని ప్రజల కోసం ఉపయోగించరా? బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించుకున్నారు. లక్ష కోట్ల సంపానలో కేసీఆర్ కున్న నైపుణ్యం ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చాకే.. ఎయిర్ పోర్ట్, కోచ్ ప్యాక్టరీ వచ్చింది. దొంగలను ఉప్పు పాతరేస్తా.. దోపిడీదారులను తరిమేస్తా. జాతిపితతో కేసీఆర్ ను పోల్చడం సరికాదు.
త్యాగాలు చేసినోళ్లు జాతిపిత అవుతారు. నోరు విప్పితే అబద్ధాలు చెప్పే వ్యక్తి జాతిపిత ఎలా అవుతారు? తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లు మన జాతిపితలు. తెలంగాణ జాతిపితలు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణను దోచుకున్న వాళ్లు జాతిపిత ఎలా అవుతారు? రాష్ట్రాన్ని కొల్లగొట్టిన పాపాల భైరవుడు కేసీఆర్.. ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు” అని నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.