రుణమాఫీ అమలుపై ప్రభుత్వం కసరత్తు.. కండీషన్లు ఇవే?

రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించడంతో రూ.2లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు.

రుణమాఫీ అమలుపై ప్రభుత్వం కసరత్తు.. కండీషన్లు ఇవే?

Crop Loan Waiver Guidelines : పంద్రాగస్టు డెడ్ లైన్.. తెలంగాణ ప్రభుత్వానికి హెడ్ లైన్ గా మారింది. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్. అయితే రుణమాఫీ అమలుకు షరతులు వస్తాయంటోంది ప్రభుత్వం. పంట రుణం తీసుకున్న ప్రతీ ఒక్కరికి కాకుండా ఫిల్టరింగ్ చేసే పనిలో పడింది సర్కార్. నిజమైన అర్హులకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటోంది రేవంత్ ప్రభుత్వం. రుణమాఫీ నుంచి మినహాయించే వారికి సంబంధించిన నిబంధనలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.

భూమికి సంబంధించి పట్టాదారు పాస్ బుక్ లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని రుణమాఫీ చేయాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులను రుణమాఫీ నుంచి మినహాయించాలని ప్రతిపాదించినట్లు చర్చ జరుగుతోంది.

రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించడంతో రూ.2లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. మరో 2, 3 రోజుల్లో ఈ జాబితా ప్రభుత్వానికి చేరనుంది. అంతలోపే రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 2లక్షల లోపు రుణాలు పొందిన వారు దాదాపు 60లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు.

అయితే, కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రుణాలు తీసుకున్న సందర్భాల్లో అందరికీ రేషన్ కార్డులు లేవని, అధికారులు గుర్తించారు. కేవలం కుటుంబ పెద్దకు మాత్రమే రేషన్ కార్డు ఉండటంతో రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇలా రేషన్ కార్డు నిబంధనను పాటిస్తే దాదాపు 18లక్షల మంది లబ్దిదారులు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులను మినహాయిస్తే మరో 2లక్షల మంది లబ్దిదారులు తగ్గుతారని భావిస్తున్నారు.

ఇలా పాస్ బుక్, రేషన్ కార్డ్, ఆదాయపన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల తొలగింపు నిబంధనలతో రుణమాఫీ అర్హుల సంఖ్య 60లక్షల నుంచి 40 లక్షల మందికి తగ్గుతుందని అంచనా వేస్తోంది వ్యవసాయ శాఖ. మరోవైపు 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ అయిన వాటికి మాఫీ అమలు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఫైనల్ గా రుణమాఫీ మార్గదర్శకాలు, అమలుపై చర్చించేందుకు రెండు మూడు రోజుల్లోనే మంత్రివర్గం సమావేశం కానుంది. క్యాబినెట్ సమావేశంలో చర్చించాక ఎంతమందికి రుణమాఫీ అమలవుతుంది? అన్న దాంతో పాటు కటాఫ్ డేట్ పైన కూడా స్పష్టత రానుంది.

Also Read : కేసీఆర్‌ను అష్టదిగ్బంధం చేసిన ఆ 8మంది నేతలెవరు? వారిని టచ్ చేసి కేసీఆర్ తప్పు చేశారా?- ప్రొ. నాగేశ్వర్ విశ్లేషణ