తెలంగాణలో కులగణనకు సర్కార్ నిర్ణయం.. 2 నెలల్లో పూర్తి చేసేలా ఆదేశాలు..
రాష్ట్రంలో కులగణన చేసేందుకు ఎలాంటి కసరత్తు చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి.. అనే దానిపై ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది.

Cm Revanth Reddy (Photo Credit : Facebook)
Telangana Caste Census : తెలంగాణలో కులగణనకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రెండు నెలల్లో డోర్ టు డోర్ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారీగా సర్వే చేయనున్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలపై సర్వే చేయనుంది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసేందుకు జీవో 18ని జారీ చేసింది. సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, విద్య, రాజకీయ, కుల.. ఆ అంశాలన్నింటిపైన సమగ్రంగా కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.
ప్రణాళిక సంఘానికి కులగణన బాధ్యత..
ఈ కులగణన చేసే బాధ్యతను ప్రణాళిక సంఘానికి అప్పజెప్పింది. రానున్న 60 రోజులు అంటే రెండు నెలల కాలంలో పూర్తి స్థాయిలో కులగణన చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. దసరా పండగ తర్వాత సోమవారం నుంచి అధికార యంత్రాంగం మొత్తం కులగణన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పర్యటించనుంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం సోమవారం ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో కులగణన చేసేందుకు ఎలాంటి కసరత్తు చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి.. అనే దానిపై ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది.
Also Read : ఐఏఎస్ ఆమ్రపాలికి ఊహించని షాక్ ఇచ్చిన కేంద్రం..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి తీరాల్సిందేనని ఆదేశం..
ఏయే జిల్లాల్లో ఏయే తేదీల్లో సర్వే చేయాలి అనేదానిపై స్పష్టత..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సచివాలయంలో ఈ సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత ఏయే జిల్లాల్లో ఏయే తేదీల్లో సర్వే చేయాలి, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అనేదానిపై స్పష్టత రానుంది. ప్రధానంగా ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల.. ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా సజావుగా, సాఫీగా 60 రోజుల్లో కులగణన ఏ విధంగా పూర్తి చేయాలి అనేదానిపై సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత అధికార యంత్రాంగం, ప్రణాళిక సంఘం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనున్నాయి.
సోమవారం నుంచే కులగణన ప్రక్రియ ప్రారంభమయ్యే ఛాన్స్..!
రేపు దసరా పండగ, ఎల్లుండి ఆదివారం. దీంతో కులగణనకు సంబంధించి సీఎస్ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రణాళిక సంఘం ముఖ్య అధికారులంతా ఈ మీటింగ్ కు పాల్గొంటారు. సోమవారం నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఆ వెంటనే రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. సమయం తక్కువగా ఉంది. కేవలం రెండు నెలల్లోనే తెలంగాణ వ్యాప్తంగా కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి.. సోమవారం నుంచే ఈ ప్రక్రియ మొత్తం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read : కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నది ఏంటి, హరియాణా ఫలితాలు ఏం సూచిస్తున్నాయి?