Cm Revanth Reddy : ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలోనే స్కామ్ బయటపడిందని వెల్లడించారు.

Telangana CM Revanth Reddy
Cm Revanth Reddy : ఫార్ములా ఈ కార్ రేస్ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు మేం సిద్ధం అని ఆయన ప్రకటించారు. అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీస్ కు వెళ్లేందుకు మేం రెడీ అని సీఎం రేవంత్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు బీఏసీలో ఎందుకు అడగలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. 3 నెలల నుంచే దీనిపై చర్చ జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. మేము ప్రమాణస్వీకారం చేసినప్పుడే ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు నన్ను కలిశారని రేవంత్ రెడ్డి తెలిపారు.
కేటీఆర్ తో చీకటి ఒప్పందం ఉందని వాళ్లే మాకు చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలోనే స్కామ్ బయటపడిందని వెల్లడించారు. ఏడాది నుంచి చర్చ జరుగుతుంటే ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్. ఓవైపు ఏసీబీ విచారణ, మరోవైపు కోర్టులో వాదనలు జరుగుతున్నాయని.. అందుకే ఫార్ములా ఈ కార్ రేస్ వివరాల జోలికి వెళ్లడం లేదని సీఎం రేవంత్ చెప్పారు.
కేటీఆర్ పై కేసు నమోదు.. అసలేంటీ ఫార్ములా ఈ కార్ రేస్…
హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. ఈ కేసులో ఏ-1గా కేటీఆర్, ఏ-2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ-3గా హెచ్ఎండీఏ అధికారి బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. రేస్ నిర్వహణ కోసం విదేశీ సంస్థకు బీఆర్ఎస్ సర్కార్ రూ.46 కోట్లను డాలర్లుగా చెల్లించింది. అయితే, ఫారిన్ కరెన్సీతో చెల్లింపునకు ఆర్బీఐ అనుమతి ఉండాలి. ఇలా జరగలేదని ఆర్బీఐ రూ.8కోట్లు ఫైన్ విధించింది. ఈ జరిమానాను రేవంత్ సర్కార్ చెల్లించింది. ఈ క్రమంలో ఈ-రేసింగ్ లో అవినీతి జరిగి ఉండొచ్చని ఏసీబీ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్.
Also Read : కేటీఆర్ అరెస్ట్ జరిగితే బీఆర్ఎస్ ను లీడ్ చేసేదెవరు? కారు స్టీరింగ్ ఆ ఇద్దరిలో ఎవరికి..?