ఏడాది సంబరాలు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.

ఏడాది సంబరాలు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

Cm Revanth Reddy (Photo Credit : Google)

Updated On : November 24, 2024 / 6:27 PM IST

Praja Palana Vijayotsavalu : తెలంగాణలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు జరగనున్నాయి. ఈ విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విజయోత్సవాల నిర్వహణపై సచివాలయంలో పలువురు మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ ఉత్సవాల్లో అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని సూచించారు.

తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ లో ఈ నెల 19న మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని అధికారులను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే విధంగా ఈ నెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో జరిగే రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సదస్సుకు రెండు రోజుల ముందు నుంచే రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి అవరసమైన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదే వేదికగా గ్రూప్ 4తో పాటు వివిధ రిక్రూట్ మెంట్ల ద్వారా ఎంపికైన 9వేల మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

డిసెంబర్ 7,8,9 తేదీలలో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని సెక్రటేరియట్ పరిసరాలు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా, ఉట్టిపడేలా ఉట్సవాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, కళా రూపాలు ఉట్టిపడే కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ షోలు, ఎయిర్ షో కన్నుల పండువగా ఉండేలా డ్రోన్ షో లను నిర్వహించాలని సూచించారు.

అలాగే రాష్ట్రమంతటా అన్ని స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ లోనూ ప్రజాపాలన వియోజత్సవ వేడుకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. డిసెంబర్ 9వ తేదీన సెక్రటేరియట్ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించారు. ఆరోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులను, మేధావులను, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభను చూపిన వారందరిని ఆహ్వానించాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్. లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.

 

Also Read : ఆ రోజు నుంచి.. ప్రజాక్షేత్రంలో మళ్లీ క్రియాశీలకంగా ఉండేలా కవిత యాక్షన్ ప్లాన్..!