గుజరాత్ గులాం- కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ ఫైర్..
ఎవరు అడ్డుకున్నా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Cm Revanth Reddy Slams Kishan Reddy (Photo Credit : Google)
Cm Revanth Reddy : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు. సబర్మతి ప్రక్షాళన చేసిన సమయంలో కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు అంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాం అయ్యారు అంటూ ఆరోపించారు. సబర్మతి కోసం 50వేలకు పైగా కుటుంబాలను పైగా వేరే చోటుకు తరలించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు గుజరాత్ దేశానికే ఆదర్శం అని పొగుడుతున్నారని, కానీ, మూసీ ప్రక్షాళనను తెలంగాణలో ఎందుకు అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డిని నిలదీశారు రేవంత్ రెడ్డి.
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. మూసీ పరివాహక ప్రాంతంలో ఉండి చూడాలని, అక్కడున్న పేదలు ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అక్కడే నిద్ర చేసి చూడాలని రేవంత్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సవాల్ ను స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు నిన్న రాత్రంతా మూసీ పరివాహక ప్రాంతంలో నిద్ర చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
గంగా నది, సబర్మతి నది ప్రక్షాళన చేసినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. అప్పుడు మాట్లాడని కిషన్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణలో మూసీ ప్రక్షాళనకు వచ్చేసరికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు అడ్డుకుంటున్నారు? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. కిషన్ రెడ్డి గుజరాత్ గులాంలా మారారని విమర్శించారు. ఎవరు అడ్డుకున్నా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Also Read : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు: పొన్నం ప్రభాకర్