“రాజీనామా చేస్తా”.. మునుగోడులో మరోసారి ఉప ఎన్నికలు ఖాయమనే హింట్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
"అవసరమైతే గతంలోలాగా మరోసారి ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు వచ్చేలా రాజీనామాకు సిద్ధం. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయను" అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

అవసరమైతే రాజీనామా చేస్తానంటూ కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. గతంలోలా మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు మొత్తం ప్రభుత్వాన్ని తీసుకొస్తానని అన్నారు. తనకు మంత్రి పదవి రాకపోతే మరోసారి ఉప ఎన్నికలు ఖాయమనే హింట్ ఇచ్చారు.
“రాజకీయాలను అడ్డం పెట్టుకొని దోచుకోవాలని అనుకునే వారికి పదవులు కావాలి. నాకు పదవులు అవసరం లేదు. ప్రజలే ముఖ్యం. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది. కానీ నా మునుగోడు ప్రజల కోసం నేను మంత్రి పదవి వదులుకున్నాను. నేను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారు.
Also Read: జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత.. ఆయన ప్రస్థానం ఇలా..
భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించినప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజల ఆలోచన. అంతేగానీ నేను వెళ్లి ఎవరినీ పదవి కోసం అడగను. పదవులను అడ్డుపెట్టుకొని సంపాదించే వాడిని కాదు. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి అభివృద్ధి సంక్షేమ కావాలి.
మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నాను. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాను. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు, నాకంటే జూనియర్ల కు పదవులు ఇచ్చారు. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు.
మనసు దిగజార్చుకొని బతకడం నాకు తెలియదు. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తా. మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధం. ఎంత దూరం అయినా పోతా. అవసరమైతే గతంలోలాగా మరోసారి ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు వచ్చేలా రాజీనామాకు సిద్ధం. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయను” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.