Cong MLA Jagga Reddy : రేవంత్‌కు త్వరలో ఝలక్ ఇస్తా-జగ్గారెడ్డి

జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి ఝలక్ అని వార్తలు వస్తున్నాయి .. కానీ నేనే త్వరలో రేవంత్ కు ఝలక్ ఇస్తానని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Cong MLA Jagga Reddy : రేవంత్‌కు త్వరలో ఝలక్ ఇస్తా-జగ్గారెడ్డి

Congress Mla Jagga Reddy

Updated On : March 22, 2022 / 2:08 PM IST

Cong MLA Jagga Reddy :  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి త్వరలో ఝలక్ ఇస్తాను  అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి.  సోషల్ మీడియాలో జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి ఝలక్ అని వార్తలు వస్తున్నాయని కానీ నేనే త్వరలో రేవంత్ కు ఝలక్ ఇస్తానని చెప్పారు.

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ముత్యాల ముగ్గు సినిమాలో నేను హీరోయిన్ అయితే రేవంత్ రెడ్డి  రావుగోపాలరావు అని వ్యంగ్యంగా అన్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న తాను ప్రస్తుతం శీల పరీక్ష ఎదుర్కోవాల్సిన పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం నాది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వవద్దని…. ఇస్తే పార్టీ నష్టపోతుందని చెప్పి తెలంగాణ ద్రోహిగా ముద్ర పడ్డానని ఆయన అన్నారు.  ఇప్పటికీ అదే స్టాండ్ తో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

ఒకరు చెబితే వినే స్వభావం కాదు నాది… ఆరోజుల్లో నా వెనుక ఎవరూ లేరు… ఈరోజు నా వెనుక ఎవరూ లేరు నా ధైర్యం అలాంటిదని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉండటం నేను అదృష్టంగా భావిస్తున్నాను.  నా పంచాయతీ పార్టీతో కాదు,  రేవంత్ రెడ్డికి నాకు మధ్య మాత్రమే గొడవ అని ఆయన స్పష్టం చేశారు.

రేవంత్ క్యారెక్టర్ విచిత్రంగా ఉంటుందని.. ఇటీవల కేసీఆర్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం యశోదా ఆస్పత్రికి వెళ్ళిన రోజు మేమిద్దరం కాంగ్రెస్ వార్ రూంలోకి వెళ్లామని అప్పడు…. జగ్గారెడ్డిని బుజ్జగించిన రేవంత్ అని వార్తలు వచ్చాయని,  కానీ అక్కడ జరిగింది వేరని చెప్పారు.

సీఎం వో నుంచి ఫోన్ వచ్చింది.. కేసీఆర్ కు ఏమైనా కావొచ్చు…నాకున్న సమాచారం వరకు గవర్నర్, ప్రగతి భవన్‌ను, యశోద హాస్పిటల్‌ను పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఏమైనా జరగవచ్చు అంటూ చాలా నెగెటివ్ గా మాట్లాడాడని చెప్పారు.

ఇప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్నానని… నేను మరేవరినో నమ్మించాల్సిన పని లేదని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజాసేవ చేస్తాను అని… కాంగ్రెస్ లో ఉన్న మజా మరెక్కడా ఉండదనే అభిప్రాయాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేశారు.